‘జన నాయకుడు’ వచ్చేస్తున్నాడు.. దళపతి విజయ్ లాస్ట్ డ్యాన్స్‌కి డేట్ ఫిక్స్.. హింట్ ఇచ్చిన కెనడా డిస్ట్రిబ్యూటర్!

Wait 5 sec.

‘జన నాయగన్‌’ సినిమా కోసం దళపతి అభిమానులు ఎన్నో నెలల నుంచి ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది విజయ్ కెరీర్ లో చివరి చిత్రం. ఆయన టీవీకే పార్టీ పెట్టి ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడే ఈ విషయాన్ని ప్రకటించారు. అందుకే ‘జన నాయకుడు’ చిత్రాన్ని అందరూ ప్రత్యేకంగా భావిస్తున్నారు. ఎప్పటికీ మర్చిపోలేని విధంగా సెలబ్రేట్ చేయాలని వేచి చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజుకు డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ‘జన నాయగన్‌’ మూవీ ఊహించని విధంగా సెన్సార్ చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. సెన్సార్ సర్టిఫికెట్‌ అడ్డంకుల కారణంగా, సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా విడుదల ఆలస్యమయింది. అయితే ఇప్పుడు సెన్సార్ ఇబ్బందులన్నీ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెలలో విజయ్ ఆఖరి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం దాదాపు ఖాయమైనట్లే కన్పిస్తోంది. . ఈ మేరకు కెనడా డిస్ట్రిబ్యూటర్‌ హింట్‌ ఇచ్చారు. కెనడా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యార్క్ సినిమాస్ ‘జన నాయగన్’ గురించి సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఎట్టకేలకు మన దళపతి విజయ్ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమయ్యారని, జులై 24 నుంచి కెనడాలో యార్క్ సినిమాస్ ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తోందంటూ ఓ పోస్టర్‌ పంచుకుంది. త్వరలోనే టికెట్‌ బుకింగ్స్‌ కూడా ఓపెన్‌ అవుతాయని పేర్కొంది. దీంతో సెన్సార్ క్లియరెన్స్ తెచ్చుకొని, జన నాయకుడు వస్తున్నాడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో 'జన నాయగన్' మూవీ తెరకెక్కింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాని తెలుగులో 'జన నాయకుడు' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలో ప్రకటించారు. ముందుగా పొంగల్ కానుకగా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారు. అయితే కొన్ని వివాదాస్పద రాజకీయ అంశాలు ఉన్నాయనే కారణాలతో సెన్సార్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. అప్పట్నుంచి సినిమా వాయిదా పడుతూనే ఉంది. ఈ వ్యవహారంపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ గ్యాప్ లో సినిమా మొత్తం లీక్ అయింది. అయినా సరే ఈ సినిమాపై ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. 'జన నాయగన్' సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, ప్రియమణి, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం సమకూర్చారు. ఇది తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' సినిమాకి రీమేక్ అనే ప్రచారం సాగుతోంది. ట్రైలర్ చూస్తే, రెండిటికీ పోలికలు స్పష్టంగా కనిపించాయి. కానీ కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలైన తర్వాత వీటన్నింటిపై అందరికీ క్లారిటీ వస్తుంది.