ఇండోనేషియాలోని వెయ్యేళ్ల నాటి ఆలయానికి మోదీ.. వీడియో షేర్ చేసిన ప్రధాని.. ఈ చారిత్రక ఆలయం ప్రత్యేకతలు ఇవే..

Wait 5 sec.

ఇండోనేషియాలోని 1000 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన పురాతన ప్రంబవన్ హిందూ ఆలయాన్ని ఆ దేశ అధ్యక్షుడు ప్రభోవో సుబియోంతోతో కలిసి బుధవారం సందర్శించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువుదీరిన త్రిమూర్తులు ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘‘శివుడితో మమేకమయ్యే అవకాశం నాకు ఎప్పుడూ లభించడం నా అదృష్టం.. హట్కేశ్వర్ మహాదేవ్ వెలసిన వాద్ నగర్‌లో నేను పుట్టాను...ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ్ ఆలయం గుజరాత్‌లోనే ఉంది.. దాని అభివృద్ధి బాధ్యతను నేను నేరుగా పర్యవేక్షిస్తున్నాను.. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం కాశీ (వారణాసి) లోని కాశీ విశ్వనాథుడు నన్ను నిరంతరం ఆశీర్వదిస్తూనే ఉన్నాడు.. కేదార్‌నాథ్ లేదా ఉజ్జయిని మహాకాల్ ఆలయాల పునర్నిర్మాణం కావచ్చు, లేదా ఇక్కడి నా పర్యటన కావచ్చు... ఈ ఆలయ పునరుద్ధరణ పనులను ప్రారంభించే అవకాశం నాకు దక్కడం మహాభాగ్యంగా భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.ఇరువురు నేతలూ హెలికాప్టర్‌లో ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశానికి ప్రయాణిస్తుండగా, ప్రధాని మోదీ ఆ ఆలయ సముదాయానికి సంబంధించిన వైమానిక దృశ్యాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ.. ‘గంభీరమైన !’ అని రాశారు. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేస్తూ, ఆలయ సముదాయం ఉమ్మడి పరిరక్షణ, పునరుద్ధరణ కోసం ఉమ్మడి ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు భారత్, ఇండోనేషియా అంగీకరించిన మర్నాడే ఈ ఆలయానికి మోదీ వెళ్లడం విశేషం.మంగళవారం జరిగిన పరిరక్షణ కార్యక్రమం కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ పరస్పరం మార్చుకున్నారు. అలాగే శాంతియుత, స్థిరమైన, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్ కోసం భారత్- ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.జావా ద్వీపంలో ఉన్న ప్రంబనన్, ఇండోనేషియాలోని అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. కంబోడియాలోని అంగోర్ వాట్ తర్వాత ఆగ్నేయాసియాలో రెండో అతిపెద్దది. దాదాపు 40 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ ప్రాంగణంలో మొదట సుమారు 240 దేవాలయాలు ఉండేవి. ఇది భారత ఉపఖండం, ఆగ్నేయాసియా మధ్య శతాబ్దాల నాటి సంబంధాలను ప్రతిబింబిస్తూ, ఇండోనేషియా అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక చిహ్నాలలో ఒకటిగా నిలిచి ఉంది.9వ శతాబ్దంలో హిందూ మాతరమ్ వంశానికి చెందిన రాజు రాకై పికటన్ ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించగా.. అతని వారసుడైన లోకపాలుడు పూర్తి చేశాడని నమ్ముతారు. ఈ ప్రాంగణంలో శివుడు, విష్ణువు, బ్రహ్మలకు అంకితం చేసిన మూడు ఎత్తైన ఆలయాలు ఉన్నాయి. వీటిలో 47 మీటర్ల శివాలయం ఈ సముదాయంలోనే అత్యంత ఎత్తైన, ప్రముఖమైన నిర్మాణంగా నిలుస్తుంది.ఆలయ గోడలు రామాయణం, ఇతర హిందూ ఇతిహాసాలలోని దృశ్యాలను వర్ణించే అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఇవి ప్రాచీన సముద్ర వాణిజ్య మార్గాల ద్వారా ఆగ్నేయాసియా అంతటా వర్ధిల్లిన సాంస్కృతిక, మతపరమైన మార్పిడిలను ప్రతిబింబిస్తాయి.10వ శతాబ్దంలో ప్రంబనన్ ఆలయం నిరాదరణకు గురైంది. జావాలోని రాజకీయ మార్పులు, సమీపంలోని మెరాపి అగ్నిపర్వత పేలుళ్లే ఇందుకు కారణమని చరిత్రకారులు భావిస్తున్నారు. ఆ తర్వాత సంభవించిన భూకంపాల వల్ల అనేక నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత 19వ శతాబ్దంలో డచ్ వలస పాలనలో దీని పునరుద్ధరణ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 1913 నుంచి 1953 మధ్య కాలంలో పెద్ద ఎత్తున జరిగిన పురావస్తు పునర్నిర్మాణం ద్వారా ప్రధాన ఆలయాలు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి.1991లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ప్రంబనన్, ప్రస్తుతం ఇండోనేషియాలోని ప్రముఖ సాంస్కృతిక ఆకర్షణలలో ఒకటిగా నిలుస్తోంది. భారతదేశ మద్దతుతో చేపట్టిన ఈ కొత్త పునరుద్ధరణ ప్రాజెక్ట్, ఆసియాలోని అత్యంత ముఖ్యమైన హిందూ స్మారక కట్టడాలలో ఒకటైన దీని పరిరక్షణకు సహకారంతో పాటు, న్యూఢిల్లీ, జకార్తాల మధ్య ఉన్న చిరకాల నాగరిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.