Market Crash: భారతీయ మార్కెట్లపై ట్రంప్ బాంబు పడింది. ఈరోజు దేశీయ మార్కెట్లు మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి కూరుకుపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 2 శాతానికి పైగా పడిపోయాయి. ఇరాన్‌తో ఇక చర్చలు లేవని, కాల్పుల విరమణ ముగిసిందంటూ అమెరికా అధ్యక్షుడు చేసింది. ట్రంప్ ప్రకటన తర్వాత క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు ఉంటాయన్న అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కీలక రంగాల్లో భారీగా అమ్మకాలు చేపట్టడంతో సూచీలు భారీగా నష్టాలు చవిచూశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ ఒక దశలో 1914 పాయింట్లు కోల్పోయి 76,266 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. ఇక జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 50 సూచీ 581 పాయింట్లు కోల్పోయి 23,900 మార్క్ దిగువకు చేరింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద నిమిషాల వ్యవధిలోనే రూ. 8 లక్షల కోట్లు ఆవిరైపోయింది. బీఎస్ఈఓలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 472 లక్షల కోట్లకు పడిపోయింది. సెన్సెక్స్‌లోని అన్ని కంపెనీల స్టాక్స్ నష్టాల్లోకి వెళ్లాయి. హిందుస్తాన్ యూనిలివర్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, మారుతీ సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారతీ ఎయిర్ టెల్ వంటి స్టాక్స్ 4 శాతం వరకు నష్టపోయాయి. కారణాలివేఅమెరికా, ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటుండడంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. అంచనాలతో దేశీయ గ్యాస్ రంగ సూచీల్లో భారీ అమ్మకాలు చేపట్టారు. గ్యాస్ సూచీలు 1.5 శాతం మేర నష్టాల్లోకి వెళ్లాయి. భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం, ఏషియన్ పెయింట్స్, ఇండిగో, ఇండియన్ ఆయిల్ వంటి షేర్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 78.35 డాలర్లకు చేరింది. అలాగే గ్లోబల్ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, ఆసియా మార్కెట్లో జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పి నష్టాల్లోకి జారుకోవడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. భారత కరెన్సీ రూపాయి విలువ సైతం మరింత పడిపోవడమూ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించింది.