బొత్స ముందు చూపు.. వారసురాలిని సిద్ధం చేస్తున్న వైసీపీ నేత.. వచ్చే ఎన్నికల బరిలో మాజీ మంత్రి కుమార్తె..?

Wait 5 sec.

ఏపీ రాజకీయాల గురించి తెలిసిన వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత సీనియర్ పొలిటీషయన్లలో ఆయన ఒకరు. ఉత్తరాంధ్ర రాజకీయాలపై బొత్స ఫ్యామిలీ ప్రభావం గురించి అందరికీ తెలిసిందే. 1999లో తొలిసారి ఎంపీగా గెలిచిన బొత్స ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పని చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి‌తోపాటు ఆయన కుమారుడు జగన్ కేబినెట్‌లోనూ ఆయన మంత్రిగా వ్యవహరించారు. 2011 నుంచి 2014 వరకు పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2015 నుంచి వైఎస్సార్సీపీలో కీలక నేతగా, ప్రస్తుతం శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స.. తన వారసురాలిని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు.సాధారణంగా రాజకీయ నేతలు ఎవరైనా కుమారులను రాజకీయాల్లోకి తీసుకొస్తారు. కుమారుడికే తన వారసత్వం దక్కాలని భావిస్తుంటారు. కానీ బొత్స మాత్రం తన కుమార్తె అనూషను వారసురాలిగా తీర్చిదిద్దుతున్నారు. బొత్స సత్యనారాయణకు కుమారుడు సందీప్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను తండ్రి తరఫున బొత్స అనూష చక్కబెడుతున్నారు. దాదాపు 8 నెలలుగా నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను ఆమెనే చూసుకుంటున్నారు. తమ నియోజకవర్గం, జిల్లా పరిధిలో ఎక్కడ శుభకార్యాలు జరిగినా బొత్స కూతుర్ని వెంటబెట్టుకొని వెళ్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలతోనూ ఆమె ప్రజలకు చేరువ అవుతున్నారు.‘మన కుటుంబం - మన కార్యకర్త’ కార్యక్రమం ద్వారా కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న కార్యకర్తలతో మాట్లాడుతూ వారిని మళ్లీ యాక్టివ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె గ్రామాల్లో తిరుగుతూ ఎన్నికల సంఘం తీసుకొచ్చిన SIR (సర్) కార్యక్రమం పట్ల జనాల్లో అవగాహన కల్పించారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. చీపురుపల్లిలో ఆమె ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు.ఇవన్నీ చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి తన కుమార్తెను ఎన్నికల్లో పోటీ చేయించేలా బొత్స పావులు కదుపుతున్నారేమో అనిపించక మానదు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు అమలు లాంటి పరిస్థితులు వస్తే.. మహిళలకు ప్రాతినిధ్యం పెంచక తప్పదు. మరోవైపు ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింది. . దీంతో క్షేత్ర స్థాయిలో ఇంతకు ముందులా ఆయన యాక్టివ్‌గా తిరగడం లేదు. దీంతో బొత్స ముందు చూపుతో తన కూతుర్ని రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారనే భావన వ్యక్తం అవుతోంది.