Tax Notice: ఆదాయపు పన్ను చట్టంలోని కొన్ని సెక్షన్ల కింద ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి. సొంత ఇల్లు లేదా స్థలాన్ని విక్రయించి, ఆ డబ్బుతో మరో ఇల్లు కొనుగోలు చేయడం లేదా నిర్మించడం చేసినప్పుడు ఐటీ చట్టంలోని సెక్షన్ 54 కింద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపులు లభిస్తుందనే సంగతి తెలిసిందే. అయితే, సాధారణంగా ఐటీ శాఖ కేవలం ఒకే ఒక్క ఇంటికి ఈ మినహాయింపు ఇస్తుంది. కానీ, జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ల విషయంలో కీలకంగా మారింది. ఓ వ్యక్తి తనకు ఉన్న భూమిని ఇచ్చి అందుకు బదులుగా 23 ఫ్లాట్స్ తీసుకున్నాడు. ఇక్కడే ఐటీ శాఖ ఎంట్రీ అయ్యి ఏకంగా రూ.8 కోట్లకు ట్యాక్స్ నోటీసులు పంపించింది. కానీ, సదరు వ్యక్తి రూపాయి కట్టకుండా బయటకు వచ్చేశారు.సాధారణంగా ఐటీ శాఖ ఒక ఇంటికి మాత్రమే సెక్షన్ 54, 54ఎఫ్ కింద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపులకు అనుమతిస్తుంది. కానీ, ఇక్కడ ఏకంగా 23 అపార్ట్‌మెంట్లకు మినహాయింపు ఇవ్వడంపై చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిల్డర్‌తో జాయింట్ డెవల్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్న ఓ వ్యక్తికి ఐటీ శాఖ రూ.8 కోట్లకు ట్యాక్స్ డిమాండ్ నోటీసులు ఇవ్వగా దానిని బెంగళూరు ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ రద్దు చేసింది. డెవలప్మెంట్ రైట్స్ ట్రాన్స్‌ఫర్ సమయంలోనే క్యాపిటల్ గెయిన్స్ వచ్చినట్లు పేర్కొంది. ఈ క్రమంలో 23 ఫ్లాట్స్‌కి ట్యాక్స్ పేయర్‌కి సెక్షన్ 54, 54ఎఫ్‌ పూర్తి మినహాయింపు లభిస్తుందని తెలిపింది. ఎప్పుడు జరిగింది?ఈ కేసు అసెస్మెంట్ ఇయర్ 2011-12కు సంబంధించినది. ఫైనాన్స్ యాక్ట్ 2014లో సవరణలు చేయకముందు ఉన్న చట్టాలే దానికి వర్తిస్తాయి. 2014 తర్వాత కొత్తగా సెక్షన్ 45 (5A)ను ఆదాయపు పన్ను చట్టంలో చేర్చారు. అంటే ప్రస్తుత ప్రాజెక్టులకు ఈ తీర్పు వర్తించదు. పాత 2014కు ముందు నాటి రీడెవలప్మెంట్ ప్రాజెక్టులకు మాత్రమే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. సదరు ట్యాక్స్ పేయర్, అతనితో పాటు మరో ఇద్దరు కో ఓనర్స్‌ 2011 మార్చి నెలలో బెంగళూరులోని తమకు ఉన్న 3 ఎకరాల 10 గుంటలను ఇచ్చి జాయింట్ డెవల్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అందుకు బదులుగా ప్రాజెక్టులోని మొత్తం 69 రెసిడెన్షియల్ ఫ్లాట్స్‌లో 23 ఫ్లాట్స్ పొందారు. కొంత వరకు నగదు లావాదేవీలు సైతం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం జేడీఏ అనేది సెక్షన్ 2 (47)(v) ల్యాండ్ అనేది డెవలపర్‌కి బదిలీ అయ్యిందని పేర్కొంది. ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రూ.8 కోట్లకు పైగా చేరినట్లు తెలిపింది. జేడీఏ ప్రకారం వచ్చిన 23 అపార్ట్‌మెంట్ల అన్నింటికీ సెక్షన్ 54 మినహాయింపు రాదని, ఒకదానికి మాత్రమే వస్తుందని స్పష్టం చేసింది. అలాగే బిల్డర్ నిర్మాణ ఖర్చులు ల్యాండ్ ఓనర్ ఖర్చుల కిందకు రావని స్పష్టం చేసింది. ఫ్లాట్స్ స్టాంప్ డ్యూటీ విలువ ప్రకారం అంచనా వేసినట్లు తెలిపింది. 1 రూపాయి కూడా ఎందుకు కట్టలేదు?ఈ క్రమంలో 23 ఫ్లాట్స్‌ని వేరు వేరు ఇళ్లుగా పరిగణించాలని, ఐటీ విభాగం వాదించింది. ఈ కారణంగా అన్ని ఫ్లాట్స్‌కి ట్యాక్స్ పేయర్ మినహాయింపులు పొందలేడని తెలిపింది. అయితే ఈ వాదనను ఐటీఏటీ తోసిపుచ్చింది. గతంలోని కర్ణాటక, ఢిల్లీ హైకోర్టుల తీర్పులను గుర్తు చేసింది. 2015 ముందు నాటి చట్ట సవరణలకు వర్తిస్తాయని తెలిపింది. సింగిల్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో మల్టిపుల్ ఫ్లాట్స్ వచ్చినా అది ఒక రెసిడెన్షియల్ హౌస్ కింద మినహాయింపులు పొందేందుకు అర్హత సాధిస్తుందని పేర్కొంది. దీంతో మొత్తం క్యాపిటల్ గెయిన్స్ రూ.8 కోట్లకు మినహాయింపు వస్తుందని తెలిపింది. దీంతో ట్యాక్స్ పేయర్‌కి ఉపశమనం లభించింది. రూపాయి కూడా కట్టకుండా బయటపడ్డారు.