హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరాల సరసన నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కీలక ముందడుగు పడింది. ఈ మెగా ప్రాజెక్టు పరిధిలోని ప్రాధాన్యతా ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ రూ.7,345.12 కోట్ల భారీ బడ్జెట్‌కు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సుదీర్ఘ కాలంగా ప్రతిపాదనల దశలో ఉన్న మూసీ సుందరీకరణ, పునరుజ్జీవన పనులు త్వరలోనే క్షేత్రస్థాయిలో వేగవంతం కానున్నాయి. అయితే, ఈ కేటాయించిన నిధులలో కేవలం అభివృద్ధి పనుల వ్యయం మాత్రమే ఉందని భూసేకరణ ఖర్చులను ఇందులో చేర్చలేదని అధికారులు స్పష్టం చేశారు. భూసేకరణకు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడిగా కేటాయించనుంది.ఈ భారీ ప్రాజెక్టు జోన్-1A, జోన్-1B పరిధిలోని ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. జోన్-1A కింద హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు ఉన్న నదీ తీరాన్ని, అలాగే జోన్-1B కింద ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు ఉన్న పరివాహక ప్రాంతాలను అనుసంధానిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. నదిలోకి మురుగునీరు చేరకుండా అడ్డుకట్ట వేయడం, నదీ తీరాల వెంబడి పచ్చదనం పెంపొందించడం, పర్యాటక ప్రాంతాలుగా మలచడం, అవసరమైన మౌలిక వసతుల కల్పన ఈ పనుల్లో ప్రధాన భాగం కానున్నాయి. హైదరాబాదీయులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ జోన్లను ముస్తాబు చేయనున్నారు.ఈ మెగా ప్రాజెక్టుకు అవసరమయ్యే భారీ ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. మొత్తం రూ.7,345.12 కోట్ల అంచనా వ్యయంలో సింహభాగాన్ని అంతర్జాతీయ సంస్థల నుంచి సేకరిస్తోంది. దీని కోసం ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి రూ.4,500 కోట్ల భారీ రుణాన్ని తీసుకోనున్నారు. ఈ మేరకు సంప్రదింపులు తుది దశకు చేరాయి. ఇక మిగిలిన రూ.2,845.12 కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్ నుంచి గ్రాంట్ రూపంలో స్వయంగా భరించనుంది. ఈ నిధుల సమీకరణతో ప్రాజెక్టుకు ఎలాంటి ఆర్థిక అడ్డంకులు లేకుండా పనులు సాఫీగా సాగడానికి మార్గం సుగమమైంది.ప్రాజెక్టు నిర్మాణంలో పారదర్శకత, వేగం పెంచేందుకు గాను ఈ పనులను పూర్తిగా ఈపీసీ మోడ్‌లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం వల్ల కాంట్రాక్ట్ పొందిన సంస్థే డిజైనింగ్, మెటీరియల్ సేకరణ, నిర్మాణ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీతో పాటు అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం సంయుక్తంగా ఈ పనుల టెండర్లు, తదుపరి చర్యలను పర్యవేక్షించనున్నాయి. రాబోయే రోజుల్లో మూసీ నది సరికొత్త రూపురేఖలతో హైదరాబాద్‌కే ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది.