కశ్మీర్‌ను తప్పుగా చూపిస్తూ మ్యాప్.. బంగ్లాదేశ్‌కు ఇచ్చిపడేసిన భారతీయ దౌత్య అధికారిణి

Wait 5 sec.

ఢాకాలో జరిగిన ఓ సదస్సు సందర్భంగా జమ్మూ కశ్మీర్‌‌ను తప్పుగా చూపిస్తూ బంగ్లాదేశ్ ప్రదర్శించిన మ్యాప్‌‌‌‌పై భారత దౌత్యవేత్త తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కశ్మీర్ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని భారత దౌత్యవేత్త పూజా కుమారి ఝా పునరుద్ఘాటించారు. ఈ వారం ఆరంభంలో ఢాకాలోని బంగ్లాదేశ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ (BIISS)లో ‘‘నమ్మకాన్ని పునర్నిర్మించడం, ప్రాంతీయ సమగ్రతను పునరుద్ధరించడం.. సార్క్‌ (SAARC) పునరుజ్జీవనానికి మార్గాలు’’ అనే అంశంపై జరిగిన సెమినార్‌లో భారత్‌లో 2009 నుంచి 14 వరకు బంగ్లాదేశ్ మాజీ హైకమిషనర్‌గా పనిచేసి అహ్మద్ తారిఖ్ కరీం మ్యాప్ చూపిస్తూ ప్రసంగిస్తుండగా.. పూజా కుమారి ఝా ఈ అభ్యంతరాన్ని లేవనెత్తారు.ప్రేక్షకులలో ఉన్న ఝా.. ఆయన ప్రసంగంలో చూపిన మ్యాప్ తప్పుగా ఉందని ఎత్తి చూపారు. ‘ఇందులో చూపించిన భారత్ మ్యాప్ తప్పుగా ఉంది.. జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగం’ అని ఆమె స్పష్టం చేశారు. దీనికి కరీం బదులిస్తూ.. ఇది కేవలం రిప్రంజటేషనల్ కోసమేనని, వాస్తవ సరిహద్దులను ప్రతిబింబించదని వివరణ ఇచ్చారు. అయితే, ఈ వివరణను పూజా కుమారి అంగీకరిస్తూనే.. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరిని మరోసారి గట్టిగా వినిపించారు.‘‘నేను అర్థం చేసుకోగలను సార్.. కానీ జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం.. ఇక్కడ దానిని తప్పుగా చూపిస్తున్నారు. అందుకే ఈ విషయాన్ని ఎత్తిచూపాలకున్నాను’’ అని ఆమె అన్నారు. ఆ తర్వాత కరీం.. మీరు భారత్ నుంచి వచ్చారా? అడగ్గా.. తాను ఢాకాలోని భారత హైకమిషన్‌లో రెండో కార్యదర్శిగా ఉన్నానని ఆమె చెప్పారు. దీంతో ఆయన‘మీ పాయింట్ నేను నోట్ చేసుకుంటున్నాను’ అని ఆయన బదులిచ్చారు.తన ప్రసంగాన్ని కరీం కొనసాగిస్తూ.. ‘‘మెజార్టీ దక్షిణాసియా దేశాలు వలస పాలన నుంచి చట్టబద్ధమైన సార్వభౌమాధికారంతో బయటపడ్డాయని, అదే సమయంలో అసమాన సంస్థలు, ప్రాదేశిక సమగ్రతపై తీవ్ర ఆందోళనలతో కూడా ఉన్నాయి’’ అని అన్నారు. ‘‘వలసవాదం కేవలం సరిహద్దులను గీయలేదు. అది రాజకీయ ఆలోచనా విధానాన్ని మార్చేసింది... భద్రతను ప్రాంతీయ పరంగా ఆలోచించేలా, పొరుగు దేశాలను భాగస్వామ్యులుగా కాకుండా.. సంభావ్య ముప్పుగా చూసేలా నాటి పాలకులను పురికొల్పింది’’ అని కరీం తెలిపారు.వలసరాజ్యాల ఏకీకరణకు ముందు దక్షిణాసియా 'మూసివేయబడిన ప్రాంతాల సముదాయం కాదని ఆయన అన్నారు. ‘‘అది సామ్రాజ్యాలు, సంస్థానాలు, వాణిజ్య నియమాలు, తీర్థయాత్రల నెట్‌వర్క్‌లు, భాషా కొనసాగింపులు, ఆచారాలు, పర్యావరణ మండలాలతో కూడిన బహుళ అంచెల ప్రాంతం.. ఆ తర్వాత సరిహద్దులుగా మారిన ప్రదేశాల నుంచి ప్రజలు స్వేచ్ఛగా తిరిగారు.. వ్యాపారం చేశారు.. పూజించారు.. వివాహాలు చేసుకున్నారు.. వలస వెళ్లాయి’’ అని ఆయన అన్నారు.‘‘విభజన అనేది కుటుంబాలను, మార్కెట్లను, నదులను, రైల్వేలను, ఓడరేవులను, జ్ఞాపకాలను, గుర్తింపులను విభజించింది.. ఇది ఉమ్మడి ప్రదేశాలను వివాదాస్పద భూభాగాలుగా మార్చింది.. రోజువారీ రాకపోకలను పాస్‌పోర్ట్‌లు, వీసాలు, అనుమానం, భద్రతా అనుమతుల వ్యవహారంగా మార్చేసింది... విభజనను ఒక కుటుంబ విడిపోవడంతో పోల్చవచ్చు’’ అని కరీమ్ వివరించారు. ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి షామా ఒబేద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.