తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపినలో పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్‌పై రివార్డు ప్రకటించారు. రాజ్‌కుమార్ ఆచూకీ తెలియజేసిన వారికి రూ.2 లక్షలు నగదు రివార్డుగా అందించనున్నట్లు పోలీసులు ప్రకటించారు. అలాగే షాబాద్ ఎస్ఐ రమేష్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.ఈ కేసులో నిర్లక్ష్యం వహించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మరోవైపు దైవాలగూడలో శుక్రవారం రాత్రిపూట జరిగిన ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. తనపై పోక్సో కేసు పెట్టారనే కోపంతో రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. మైనర్ బాలిక అయిన తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ రాజ్‌కుమార్ మీద బాలిక తల్లి మే 16వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో కేసు కింద రాజ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు.అయితే బెయిల్ మీద తిరిగొచ్చిన రాజ్ కుమార్.. ఈ దారుణానికి ఒడిగట్టాడు. షాబాద్‌లోని మైనర్ బాలిక ఇంట్లోకి శుక్రవారం రాత్రి పూట ప్రవేశించిన రాజ్‌కుమార్.. ఆమెను బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే బాలిక తల్లి లక్ష్మి, నాయనమ్మ రుక్కమ్మ ఈ విషయాన్ని గమనించి అడ్డుపడటంతో వారిద్దరినీ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత బాలికను అఖిల్ సాగర్ చెరువు వద్దకు లాక్కెళ్లిన రాజ్‌కుమార్.. కత్తితో పీక కోసి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత దైవాలగూడలోని ఇంటికి చేరుకున్న రాజ్‌కుమార్.. భార్యా, ఇద్దరు కొడుకులను కత్తితో పీకలు కోసి హతమార్చాడు. అనంతరం తన తండ్రికి ఫోన్ చేసి హత్యలు చేసిన విషయాన్ని చెప్పాడు. తాను కూడా చనిపోతున్నానని ఫోన్‌లో తెలియజేశాడు. దీంతో రాజ్‌కుమార్ తండ్రి అరుణ్ కుమార్ ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు 10 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ, టోల్‌ప్లాజా వివరాల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు, ఈ క్రమంలోనే రాజ్‌కుమార్‌పై రూ.2 లక్షల రివార్డు ప్రకటించారు.