: భారతదేశంలో డిస్కౌంట్ రిటైల్ వ్యాపారానికి కేరాఫ్‌గా నిలిచిన, దిగ్గజ పారిశ్రామిక వేత్త రాధాకిషన్ దమానీకి చెందిన డీమార్ట్ క్యూ1లో అదరగొట్టింది. శనివారం రోజు డీమార్ట్ పేరెంట్ కంపెనీ అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాల్ని విడుదల చేసింది. ఇక్కడ గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోలిస్తే డీమార్ట్ నికర లాభం, ఆదాయం, నిర్వహణ లాభాలు (EBITDA) అన్నింట్లోనూ రెండంకెల మేర వృద్ధి నమోదు చేసింది. మెట్రో నగరాలతో పాటుగా నాన్ మెట్రో (చిన్న పట్టణాలు) మార్కెట్లలోనూ స్టోర్ల విస్తరణ కంపెనీకి బాగా కలిసొచ్చింది. ఈ ఏప్రిల్- జూన్ 3 నెలల కాలంలో కంపెనీ సాధించిన ఆర్థిక లాభాల గురించి చూద్దాం. ఏప్రిల్- జూన్ కాలంలో డీమార్ట్ నికర లాభం రూ. 860.6 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఇదే సమయంలో లాభం రూ. 773 కోట్లుగా ఉండగా 11.3 శాతం మేర వృద్ధి కనబరిచింది. ఇంకా మొత్తం ఆదాయం చూస్తే సమీక్షా కాలంలో రూ. 18,795 కోట్లుగా వచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఆదాయం రూ. 16,360 కోట్లుగా ఉండగా ఇక్కడ 14.9 శాతం వృద్ధి నమోదైంది.ఇదీ చూడండి: ఒక్కో షేరుపై సంపాదన వివరాలివే..ఇక డీమార్ట్ నిర్వహణా లాభం (ఎబిటా) రూ. 1499 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఇది రూ. 1299 కోట్లుగా ఉండేది. ఇక్కడ 15.4 శాతం వృద్ధి నమోదైందని చెప్పొచ్చు. ఎబిటా మార్జిన్ స్వల్పంగా పెరిగి 8 శాతానికి చేరింది. ఇదే సమయంలో ప్రతి షేరుపై సంపాదన (EPS- ఎర్నింగ్స్ పర్ షేర్) రూ. 11.88 నుంచి రూ. 13.20 కి చేరింది.డీమార్ట్ తన రిటైల్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. ఈ జూన్ త్రైమాసికంలో కంపెనీ కొత్తగా 3 స్టోర్లను ప్రారంభించింది. దీంతో 2026, జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 503 కు చేరింది. చిన్న నగరాలు, నాన్ మెట్రో సిటీల్లో స్టోర్లు అద్భుతమైన వృద్ధిని కనబరిచినట్లు కంపెనీ ఫలితాల విడుదల సమయంలో తెలిపింది.Read Also: 7 నగరాల్లో డీమార్ట్ రెడీ స్టోర్లు క్లోజ్!ఇక డీమార్ట్ ఆన్‌లైన్ ఇ- కామర్స్ విభాగమైన డీమార్ట్ రెడీ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ దాసు మాట్లాడుతూ పెద్ద మెట్రో నగరాలపైనే తాము పూర్తి ఫోకస్ పెడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే వ్యాపార పరంగా పెద్దగా లాభదాయకంగా లేని 7 నగరాల్లో తమ ఆన్‌లైన్ డెలివరీ ఆపరేషన్లను పూర్తిగా నిలిపివేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం డీమార్ట్ రెడీ సేవలు దేశంలోని 11 ప్రధాన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. డీమార్ట్ షేరు శుక్రవారం రోజు స్వల్ప నష్టంతో రూ. 4075 వద్ద స్థిరపడింది. మార్కెట్ విలువ రూ. 2.66 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 10 శాతం వరకు షేర్ ధర పెరిగింది.