న్యాయం కోసం నమ్మి వచ్చిన ఒక నిస్సహాయ మహిళపై ఇద్దరు వ్యక్తులు కామంతో బరితెగించి అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన సికింద్రాబాద్ పరిధిలో వెలుగుచూసింది. మహంకాళి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక 43 ఏళ్ల మహిళకు తొమ్మిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం ఏడేళ్ల వయసున్న ఒక కుమారుడు ఉన్నాడు. అయితే.. గత రెండేళ్లుగా భర్తతో తీవ్రమైన వివాదాలు కొనసాగుతుండటంతో ఆమె ప్రస్తుతం అతనికి దూరంగా ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఇటువంటి కుటుంబ సమస్యలపై ఒక ప్రముఖ టీవీ ఛానెల్‌లో నిర్వహిస్తున్న ఒక సామాజిక కార్యక్రమం ద్వారా న్యాయం పొందేందుకు ఆమె మంగళవారం ట్రైన్‌లో సికింద్రాబాద్‌కు చేరుకుంది.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆ మహిళను ఒక గుర్తు తెలియని వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. తనకు ఆ టీవీ కార్యక్రమాన్ని నిర్వహించే నిర్వాహకులతో మంచి పరిచయాలు ఉన్నాయని, న్యాయం జరిగేలా చూస్తానని నమ్మబలికాడు. అతని మాటలను నిజమేనని నమ్మిన బాధితురాలు అతనితో కలిసి బైక్‌పై బయలుదేరింది. ఆ కీచకుడు ఆమెను రాణిగంజ్‌లోని హైదర్‌ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లి అక్కడ ఎవరూ లేని నిర్జన ప్రదేశంలో బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా కొంతసేపటి తర్వాత అక్కడికి వచ్చిన అతని మరొక స్నేహితుడు కూడా ఆమెపై దారుణంగా అఘాయిత్యానికి ఒడిగట్టాడు. దీంతో బాధితురాలు పెద్దగా కేకలు వేసింది. ఆమె గట్టిగా అరుస్తుండటంతో చుట్టుపక్కల వారు ఎక్కడ వస్తారోనని భయపడిపోయిన ఆ ఇద్దరు నిందితులు అక్కడి నుంచి వెంటనే బైక్‌పై పారిపోయారు. బాధితురాలు ఎలాగోలా సమీపంలోని మహంకాళి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘోరాన్ని పోలీసులకు వివరించి, నిందితులపై రాతపూర్వక ఫిర్యాదు చేసింది. ఈ అమానుష ఘటనపై తక్షణమే స్పందించిన మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనా స్థలంలోని ఆధారాలు, బాధితురాలి సమాచారం మేరకు నిందితులను గుర్తించి వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇన్‌స్పెక్టర్ రవికుమార్ వెల్లడించారు.