కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తూనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. సొంతంగా ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) అనే పొలిటికల్ పార్టీ పెట్టిన ఆయన.. తొలి ఎన్నికల్లోనే అఖండ విజయం సాధించి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే ఇప్పుడు విజయ్ బాటలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారని తమిళనాట జోరుగా ప్రచారం జరుగుతోంది. తమిళ స్టార్ హీరోలలో ధనుష్ ఒకరు. తమిళనాట ఆయనకు మంచి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ చేపడుతున్న కార్యకలాపాలను బట్టి, ధనుష్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం మొదలైంది. త్వరలోనే పార్టీ పెట్టి తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే ఆలోచన చేస్తున్నారనే మాట గట్టిగా వినిపిస్తోంది.ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా అబిమానులు ఆవిష్కరించిన ఓ జెండా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధనుష్ రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న ఫోటోతో పాటు ఒక నక్షత్రం, ఎరుపు+తెలుపు రంగుల కలయికలో రూపొందించిన ఈ జెండా.. రాజకీయ పార్టీ జెండాను తలపించేలా ఉంది. దీంతో ధనుష్ పాలిటిక్స్ లోకి రావాలనే ఆలోచనతో ఉన్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తమిళనాడు రాజకీయాలకు, తమిళ సినీ రంగానికి అవినాభావ సంబంధం ఉంది. అనేకమంది కోలీవుడ్ నటీనటులు పాలిటిక్స్ లో అడుగుపెట్టారు. వారిలో కొందరు సొంతంగా పార్టీలు పెట్టి, రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రులుగా, కేంద్రమంత్రులుగా, ఎంపీలుగా పని చేశారు. ఇప్పుడు విజయ్ సీఎం అయ్యారు. డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల హవా నడుస్తున్న సమయంలో.. విజయ్ వారికి ప్రత్యామ్నాయంగా మారారు.విజయ్ ముందుగా ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ (VMI) అనే సేవా సంస్థను ఏర్పాటు చేసి, దశాబ్ద కాలం పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో క్యాడర్‌ను సిద్ధం చేసుకున్న తర్వాతే టీవీకే పార్టీని ప్రకటించారు. ఇప్పుడు ధనుష్ అభిమాన సంఘాల ప్రత్యేక సమావేశాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రత్యేక జెండాల ఆవిష్కరణలు చూస్తుంటే.. ధనుష్ కూడా రాజకీయాల్లోకి రావాలనే ఎత్తుగడతోనే ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. ''రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, అది వారి వ్యక్తిగత ఇష్టం. భవిష్యత్తులో ధనుష్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టవచ్చు. మాకు రాజకీయాలు వద్దు అని చెప్పడానికి మనమెవరం? నేనైతే రాను, ఎందుకంటే నాకు వయసు అయిపోయింది. కానీ నా కొడుకులు (ధనుష్, సెల్వరాఘవన్) రావచ్చు, నా మనవళ్లు కూడా రావచ్చు'' అని కస్తూరి రాజా అన్నారు.ధనుష్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రాజకీయాల్లోకి రావడం గురించి ఇప్పటివరకు ఆయన ఎక్కడా మాట్లాడలేదు. నిజంగానే ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారా? ధనుష్ ఫ్యాన్స్ అసోసియేషన్ జెండా ఆవిష్కరణ వెనుక రాజకీయ వ్యూహం ఉందా? అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.