పీఓకేలో ఉద్యమం ఉద్ధృతం.. పాకిస్థాన్‌కు 48 గంటల డెడ్‌లైన్.. భారత్ వైఖరి ఏంటి?

Wait 5 sec.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (PoK)లో ఉద్రిక్తతలు మరిత తీవ్రస్థాయికి చేరుకున్నాయి. అక్కడ ప్రజా ఉద్యమానికి నేతృత్వం వహిస్తోన్న పాకిస్థాన్‌ ప్రభుత్వానికి 48 గంటల డెడ్‌లైన్ విధించింది. ఆలోగా తమ 38 డిమాండ్లను అంగీకరించకుంటే భారీ ఎత్తున నిరసనకు దిగి, తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించింది. జులై 27 జరగనున్న స్థానిక శాసనసభ ఎన్నికల్లో 12 సీట్లను శరణార్థులకు కేటాయించడం ఈ ఉద్రిక్తతలకు కారణం. జూన్ 9న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ముజఫరాబాద్‌కు భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్టు జేఏఏసీ () ప్రకటించింది. ఇది ఇటీవలి కాలంలో ఈ ప్రాంతం చూసిన అతిపెద్ద రాజకీయ ఘర్షణలలో ఒకటిగా మారుతుందనే సంకేతాలు ఇచ్చింది.శరణార్థులకు సీట్లు కేటాయింపు పీఓకే రాజకీయాలపై ఇస్లామాబాద్ అసమానమైన ప్రభావాన్ని కొనసాగించడానికి వీలు కల్పిస్తాయని జాక్ వాదిస్తోంది. జర్నలిస్ట్ లవ్ పూరి ప్రకారం.. 12 శరణార్థుల సీట్లు పాకిస్థాన్‌లోని సుమారు 4.36 లక్షల నమోదిత ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. మిగిలిన 33 ప్రత్యక్షంగా ఎన్నికయ్యే సీట్లు పీఓకేలో నివసిస్తున్న దాదాపు 33 లక్షల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ ప్రాంత నివాసితులకు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల కంటే శరణార్థుల నియోజకవర్గాలకు ఇది ఎన్నికల్లో ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుందని వాదిస్తున్నారు. దీనికి తోడు 12 రిజర్వ్ సీట్లను రద్దుచేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని పీఓకే సుప్రీం కోర్టు జూన్ 7న తీర్పు ఇచ్చింది. పాకిస్థాన్ సైన్యం, పీఓకే ఉద్యమకారులకు జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.38 డిమాండ్లుశరణార్థుల సీట్ల అంశం తక్షణ సమస్యగా మారినప్పటికీ, జేఏఏసీ (JAAC) చార్టర్ అంతకంటే లోతైన ఆర్థిక అసంతృప్తిని ప్రతిబింబిస్తుంది. రిజర్వ్ సీట్లను రద్దు చేయాలని కోరడంతో పాటు, జలవిద్యుత్ ప్రాజెక్టులపై పూర్తి పునఃసమీక్ష, విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి నిత్యావసర వస్తువులపై అధిక సబ్సిడీలు, విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేసింది. తమ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు స్థానికులు అధిక ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని కూడా వాదిస్తోంది. రాజకీయ వివక్ష, ఆర్థిక నిర్లక్ష్యం వంటి వాటిపై స్థానికులలో పెరుగుతున్న అసంతృప్తిని ఈ డిమాండ్లు ప్రతిబింబిస్తున్నాయి.అవామీ యాక్షన్ కమిటీ ఆవిర్భావం2023లో ఏర్పడిన జాక్.. పీఓకేలో అత్యంత ప్రభావవంతమైన పౌర హక్కుల వేదికగా ఆవిర్భవించింది. 2024 మే నెలలో జరిగిన విస్తృత నిరసనల సమయంలో దీని పేరు వెలుగులోకి వచ్చింది. ధర్నాలు, సమ్మెలు, వీల్-జామ్ నిరసనలతో ఆ ప్రాంతాన్ని స్తంభింపజేసింది. విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, గిల్గిట్-బాల్టిస్థాన్ వంటి ఇతర పాక్ పాలనలోని ప్రాంతాలలో లభించే రాయితీలతో సమానమైన రాయితీల కోసం చేసిన డిమాండ్లు ఈ ఆందోళనకు కారణమయ్యాయి. అప్పటి నుంచి ఈ సంస్థ పదేపదే పెద్ద ఎత్తున నిరసనలను చేపట్టింది.పీఓకేకు స్వయంప్రతిపత్తి ఉందా?ఈ ప్రాంతాన్ని ‘ఆజాద్’ (స్వేచ్ఛా) కశ్మీర్‌గా పాకిస్థాన్ వర్ణిస్తుంది.. కానీ దాని రాజ్యాంగ, పరిపాలనా నిర్మాణం మరింత సంక్లిష్టమైన చిత్రాన్ని అందిస్తుంది. సాంకేతికంగా దేశంలోని ప్రావిన్సులను జాబితా చేసే పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం పీఓకే పాకిస్థాన్‌లో భాగంగా లేదు. దీంతో పాకిస్తాన్ పార్లమెంటులో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం లేదు. పీఓకేకు స్వంత అధ్యక్షుడు, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు, ఎన్నికైన అసెంబ్లీ ఇవన్నీ కాగితాలకే పరిమితం. పెత్తనమంతా ఇస్లామాబాద్ నియంత్రణలో ఉన్న సంస్థల వద్ద ముఖ్యంగా పాకిస్థాన్ ప్రధానమంత్రి నేతృత్వంలోని కశ్మీర్ కౌన్సిల్‌దే. పీఓకే రాజ్యాంగం ప్రకారం.. ఈ ప్రాంతం పాకిస్థాన్‌లో విలీనం కావడాన్ని ఏ వ్యక్తి గానీ, రాజకీయ పార్టీ గానీ వ్యతిరేకించకూడదు. ఎన్నికలలో పోటీ చేయడానికి ముందు, అభ్యర్థులు విలీనానికి మద్దతు ఇస్తున్నట్లు ఒక ప్రకటనపై సంతకం చేయాల్సి ఉంటుంది.వనరులు సుసంపన్నం.. ప్రతిఫలం శూన్యంఅడవులు, గ్రాఫైట్, పాలరాయి, రత్నాలతో సహా అరుదైన ఖనిజాలు, అన్నింటికంటే ముఖ్యంగా నీటితో పీఓకే సమృద్ధిగా ఉంది. పాకిస్థాన్‌ పంజాబ్, సింధ్‌లోని వ్యవసాయ ప్రధాన ప్రాంతాలకు ఉపయోగించే సాగునీటిలో దాదాపు 70 శాతం అక్కడ పుట్టిన సింధు నదీ వ్యవస్థ ద్వారా ప్రవహిస్తుంది. ఈ ప్రాంతంలోని జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా పాక్‌ విద్యుత్‌లో దాదాపు 10 నుంచి 15 శాతం ఉత్పత్తి చేస్తున్నాయని అంచనా. అయినప్పటికీ తమ ప్రాంతంలో లభ్యమయ్యే సహజ సంపద నుంచి చాలా తక్కువ ప్రయోజనాన్ని పొందుతున్నామని, ఆదాయమంతా పాకిస్థాన్‌కు తరలిపోతుందని, మౌలిక సదుపాయాలు, ప్రజా సేవలు అభివృద్ధి చెందడం లేదని చాలా కాలంగా స్థానికులు ఆరోపిస్తున్నారు.వ్యవసాయమే జీవనాధారం.. అయినా ఆకలి కేకలుఆర్థిక ఇబ్బందులు పీఓకే ప్రజల అతిపెద్ద మనోవేదనలలో ఒకటి. నేచుర్ జర్నల్ 2025 అధ్యయనం ప్రకారం.. జనాభాలో దాదాపు 66 శాతం మంది వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడి ఉన్నారు. అయినప్పటికీ 57.1 శాతం మంది ఆహార కొరతతో బాధపడుతున్నారు. దాదాపు 29 శాతం మంది నివాసితుల్లో పోషకాహార లోపం (ఇది పాక్ సగటు 19.9 శాతం కంటే చాలా ఎక్కువ) వేధిస్తోంది. పర్వత ప్రాంతాల్లో అయితే 90 శాతం కుటుంబాలను ఆహరలేమి ప్రభావం చూపుతున్నట్టు నివేదికలు పేర్కొంటున్నాయి. ఆరోగ్య సంరక్షణ సూచీలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. పాకిస్థాన్‌ వాలంటరీ నేషనల్ రివ్యూ నివేదిక ప్రకారం.. ఐదేళ్లలోపు పిల్లలలో 39 శాతం మందికి ఎదుగుదలలోపం, ప్రసూతి మరణాల నిష్పత్తి 100,000 సజీవ జననాలకు 104 మరణాలుగా ఉంది.అధ్వాన్నంగా భద్రతా పరిస్థితులుసున్నితమైన భద్రతా పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ అశాంతి నెలకుంది. ఇటీవల అణచివేత చర్యల్లో భాగంగా సామూహిక అరెస్ట్‌లు చేశారని, 100 మందినిపైగా చంపేశారని రాజకీయ కార్యకర్త అమ్జద్ మీర్జా ఆరోపించారు. అదే సమయంలో, అంతటా భద్రతారమైన సవాళ్లు తీవ్రమయ్యాయి. యూరోపియన్ యూనియన్ శరణార్థుల సంస్థ మే 2026 నివేదిక ప్రకారం నవంబరు 2024 నుంచి ఏప్రిల్ 2026 మధ్య అజాద్ జమ్మూ కశ్మీర్, గిల్గిత్-బాల్టిస్థాన్ అంతటా సాయుధ ఘర్షణలు, పేలుళ్లతో సహా 39 భద్రతా సంఘటనల చోటుచేసుకోగా.. 56 మంది ప్రాణాలు కోల్పోయారు.పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ ప్రకారం.. తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) పునరుజ్జీవనంతో గతేడాది పాకిస్థాన్‌లో 1,045 తీవ్రవాద సంఘటనలు, 1,139 మరణాలు సంభవించాయి. ఒక దశాబ్దంలో ఇంతటి స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి.భారత్ వైఖరేంటి?స్వాతంత్య్రం తర్వాత 1947 అక్టోబరు 26న అప్పటి కశ్మీర్ సంస్థానాధీశుడు రాజా హరిసింగ్ భారత్‌లో వీలీనానికి అంగీకరించి, ఒప్పందంపై సంతకం చేశారు. దీని ద్వారా చట్టబద్దంగా జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో విలీనమైంది. దేశంలోని 560కిపైగా సంస్థానాలు విలీనంలో అనుసరించి ప్రక్రియే ఇక్కడా జరిగింది. కానీ, పాకిస్థాన్ గిరిజన దురాక్రమణదారులను, తర్వాత తన సైన్యాన్ని పంపి యుద్ధానికి తెరతీసింది. కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. ఇదే ప్రస్తుత పాక్ ఆక్రమిత కశ్మీర్. అయితే, జమ్మూ కశ్మీర్ మొత్తం భారత్‌లో అంతర్భాగమని, పాకిస్థాన్ తన అధీనంలో ఉన్న ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయాలని పేర్కొంటూ 1994 ఫిబ్రవరి 22న భారత్ పార్లమెంట్ ఉభయసభలు ఏకగ్రీవంగా తీర్మానించాయి.ప్రస్తుతం స్థానిక శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటం, అలాగే జాక్ తన నిరసనల్లో అత్యంత కీలకమైన అఖరి దశకు పిలుపునిస్తామని హెచ్చరికలు చేయడంతో పీఓకే మరో రాజకీయ సంఘర్షణ దిశగా పయనిస్తున్నట్టు కనిపిస్తోంది.