దేవుళ్లను దూషించే రావణ్‌కు YCP ఆర్థిక సాయం..ఇది ఎంత బరితెగింపు..: సీఎం చంద్రబాబు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు హిందూ దేవుళ్లను కించపరుస్తూ, నిషేధిత తీవ్రవాద సంస్థలకు మద్దతుగా వీడియోలు పోస్ట్ చేసిన కేసులో అరెస్టయిన యూట్యూబర్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా స్పందించారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటించిన ముఖ్యమంత్రి.. అక్కడ రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సమాజంలో మత విద్వేషాలు రేకెత్తించే రావణ్ లాంటి అసాంఘిక శక్తుల వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందని అన్నారు. రావణ్‌కు గొడ్డలి పార్టీనే భారీగా ఆర్థిక సాయం అందిస్తోందని ఆరోపణలు చేశారు.'సంఘ విద్రోహ శక్తులను ఎవరూ ప్రోత్సహించవద్దు. కుల, మతాలను విభజించడానికి వీల్లేదు. పురాణాలను దూషించాడు. రాముడు, సీతపై నీచంగా మాట్లాడాడు. తీవ్రవాదాన్ని, పాకిస్థాన్‌ను సమర్థించాడు. అలాంటి వాళ్లకు గొడ్డలిపార్టీ ఆర్థికసాయం చేసింది. ఇది ఎంత బరితెగింపు. ఇది న్యాయమా..? ప్రజలకు ఈ విషయాలు తెలియాలి. నంద్యాల పక్కనే పులివెందుల. 2019 అందరూ గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు నేనే ముఖ్యమంత్రిని. నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాబాయ్‌ను గొడ్డలితో లేపేసి.. గుండెపోటుగా చిత్రీకరించి.. రెండో రోజున కత్తి నా చేతులో పెట్టి రాజకీయ డ్రామా ఆడారు.' అని చంద్రబాబు ఫైరయ్యారు. రాష్ట్రంలో వింత ప్రవర్తన కలిగిన కొందరు వ్యక్తులు తిరుగుతున్నారని.. కేవలం ఆస్తి కోసం కన్న తల్లిని హింసిస్తున్నారని ఫైరయ్యారు. ఓట్ల కోసం చనిపోయిన తండ్రి ఫోటోలకు పూజలు చేస్తారని.. కన్నతల్లిని గౌరవించలేని వ్యక్తి సమాజానికి ఏం అవసరమని ప్రశ్నించారు. తల్లుల విలువ తెలిసిన ప్రభుత్వం కాబట్టే తాము తల్లికి వందనం పథకం తెచ్చామన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఒకప్పుడు ఉన్న ఫ్యాక్షనిజం, ముఠా కక్షలను అణచివేసి శాంతిభద్రతలను నెలకొల్పింది తెలుగుదేశం ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విసుగు, విరామం లేకుండా కేవలం ప్రాంతాల వారీగా ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు చూస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు కూటమి ప్రభుత్వం పూర్తి రక్షణగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఆడబిడ్డల జోలికి వస్తే ఎంతటి వారికైనా సరే.. అదే చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు.