స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై ఐసీసీ సీరియస్.. ఇంగ్లాండ్ బోర్డుకు నోటీసులు!

Wait 5 sec.

మ్యాచ్ జరుగుతుండగా, డ్రెస్సింగ్ రూమ్‌లో రికార్డు చేసిన వీడియోను రిలీజ్ చేయడం పట్ల ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఇంగ్లాండ్, వెల్స్ క్రికెట్ బోర్డును కోరింది. న్యూజిలాండ్‌తో మూడో టెస్టు జరుగుతుండగా ఇందుకు సంబంధించిన వీడియోను ఈసీబీ విడుదల చేయడంపై వివాదం చెలరేగింది.అంతర్జాతీయ క్రికెట్‌కు హఠాత్తుగా వీడ్కోలు పలికి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు బెన్ స్టోక్స్‌. ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య మూడో టెస్టు 4వ రోజు వీడ్కోలు వార్త బయటకొచ్చింది. ఆ రోజు ఆట మొదలవ్వడానికి ముందే డ్రెస్సింగ్ రూమ్‌లో స్టోక్స్ తనకు కెప్టెన్‌గా, ఆటగాడిగా ఇదే చివరి మ్యాచ్ అని సహచరులకు చెప్పాడు. అతడు తన వీడ్కోలు గురించి వెల్లడిస్తుండగా ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు మీడియా బృందం ఆ దృశ్యాలను రికార్డు చేసింది. అదేరోజు టీ బ్రేక్ సమయంలో సోషల్ మీడియాలో, టీవీ ఛానెళ్లలో స్టోక్స్ రిటైర్మెంట్ వార్త వెలుగులోకి వచ్చింది.ఇక మ్యాచ్ జరుగుతుండగానే స్టోక్స్ వీడ్కోలు వీడియో బయటకు రావడంపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆటగాడు, మ్యాచ్ అధికారులకు సంబంధించిన (పీఎంఓఏ) నిబంధలన ప్రకారం బెన్ స్టోక్స్ ఉల్లంఘనకు పాల్పడ్డాడని, ఈసీబీ కూడా ఇందులో హద్దు మీరిందని ఐసీసీ పేర్కొంది. పీఎంఓఏ నిబంధల ప్రకారం, మ్యాచ్ సమయంలో.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటివి రికార్డు చేయకూడదు. దీన్ని అతిక్రమణగా తేల్చిన ఐసీసీ.. దీనిపై వివరణ ఇవ్వాలని ఈసీబీకి నోటీసులు పంపింది.మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు నోటీసులు పంపడంపై బెన్‌ స్టోక్స్ సెటైర్ వేశాడు. దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ‘అతడిపై వేటు వేయండి’ అని ట్వీట్ చేశాడు. ఇక ఈ వివాదంపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.