చెన్నైలోని ఎగ్మోర్ ప్రభుత్వ మహిళా, శిశు హాస్పిటల్‌లో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డైరీలో రాసుకుంటూ వార్తల్లో నిలిచిన సీఎం విజయ్, ఆసుపత్రి తనిఖీల్లోనూ డైరీతో కనిపించడం గమనార్హం. తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కేజీ అరుణ్‌ రాజ్‌, ఉన్నతాధికారులతో కలిసి ఆసుపత్రికి వచ్చిన ఆయన.. ప్రసూతి, గైనకాలజీ సహా పలు వార్డులను పరిశీలించారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాల గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు. రోగులు, వారి కుటుంబ సభ్యులతో విజయ్ నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్లు, సిబ్బందితో సమావేశమైన సీఎం.. వారికి ఎదురువుతున్న ఇబ్బందులు, సవాళ్ల గురించి చర్చించారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఎగ్మోర్ ఆసుపత్రిలో సిబ్బంది లంచాల వేధింపులు, పారిశుద్ధ్య లోపంపై ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అక్కడ తనిఖీలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమస్యలను వెంటనే పరిష్కరించాలని, రోగులకు అవసరమైన వైద్యం అందించాలని అధికారులను తమిళనాడు సీఎం ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని, వార్డులను శుభ్రంగా ఉంచాలని, ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు. తనిఖీల్లో భాగంగా వార్డుల్లోని బాలింతలతో విజయ్ ముచ్చటించారు. కొందరు నవజాత శిశువులను ఆయన చేతుల్లోకి తీసుకుని లాలించారు.ఆసుపత్రి సిబ్బంది లంచాలు డిమాండ్ చేశారని, సమయానికి ఆహారం అందించడం లేదని, ప్రాథమిక సౌకర్యాలు సరిపోవడం లేదని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అరుణ్ రాజ్ స్పందిస్తూ.. ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగించినట్లు తెలిపారు. అదనపు టాయిలెట్లు, మరిన్ని వార్డులు, క్యాంటీన్ అవసరమని రోగులు, సందర్శకుల నుంచి అభిప్రాయాలు వచ్చాయని ఆయన తెలిపారు. ఆసుపత్రి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలను పరిశీలిస్తుందని కూడా ఆయన చెప్పారు.కాగా, సీఎం పర్యటనకు రాజకీయ ప్రాముఖ్యత కూడా ఉంది. విజయ్‌కు మహిళలు, పిల్లల కీలక మద్దతుదారులుగా పరిగణిస్తారు. ఈ వర్గాల్లో ఆయనకున్న ప్రజాదరణే ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) విజయానికి దోహదపడి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సహాయపడిందని విస్తృతంగా భావిస్తున్నారు.