రాజకీయాలు, పరిపాలన, వరుస సమీక్షలతో ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా గడిపే ప్రజాప్రతినిధులకు కుటుంబంతో గడిపే సమయం దొరకడం చాలా అరుదు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి విషయానికి వస్తే.. ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి వరకు ఫైళ్లు, ప్రజా సమస్యలు, అధికారిక పర్యటనలతోనే సరిపోతుంది. అంతటి బిజీ లైఫ్‌లో కూడా తెలంగాణ సీఎం తన మనవడి కోసం చేసిన పని అందరి హృదయాలను గెలుచుకుంటోంది. తన మనవడు రేయాన్ష్ కోరిక మేరకు సీఎం రేవంత్ రెడ్డి వంటింట్లోకి వెళ్లి పూరీలు వేశారు. 'తాతా.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా' మారాం చేస్తూ అడగటంతో సీఎం రేవంత్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. తన బిజీ షెడ్యూల్‌ను పక్కనపెట్టి, గరిట పట్టుకొని వంటింట్లో దూరిపోయారు. మనవడిని తన పక్కనే ఉన్న కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై కూర్చోబెట్టుకుని.. పూరీలు వేశారు. చేతిలో పిండి ముద్ద పట్టుకుని రేవంత్ రెడ్డి పూరీలను కడాయిలో వేస్తుంటే ఎంతో ముచ్చటగా అనిపించింది. తాత పూరీలు వేస్తుంటే పక్కనే కూర్చున్న మనవడు రేయాన్ష్ ఊరికే ఉండకుండా వంటపై చమత్కారంగా సలహాలు, ఆర్డర్లు ఇవ్వడం ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచింది. 'తాతా.. అది రౌండ్‌గా లేదు, ఓవల్ షేప్‌లో ఉంది' అంటూ కామెంట్ చేశాడు. అంతేకాకుండా.. 'తాతా.. నాకే కాదు.. అమ్మమ్మకు కూడా వేయ్.. నాన్నకు కూడా వేయ్' అంటూ ముద్దు ముద్దుగా ఆర్డర్లు వేశాడు. మనవడి మాటలకు సీఎం రేవంత్ రెడ్డి నవ్వుకుంటూ పూరీలు వేసి ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఆ పోస్టుకు ఆయన పెట్టిన క్యాప్షన్ కూడా అంతే ఆకట్టుకుంది. 'తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా అని మనవడు అడిగితే తప్పుతుందా? పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు... బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు..' అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రాజకీయాలు, పరిపాలన, ప్రత్యర్థులపై విమర్శల వేడితో ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే రేవంత్ రెడ్డిలో ఒక మంచి తాతయ్యను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'రాష్ట్రానికి సీఎం అయినా.. మనవడికి తాతే కదా' అంటూ కామెంట్లు పెడుతున్నారు.