4 లక్షల డాలర్ల దోపిడీ కేసులో భారత పోలీస్ అధికారిపై ఎఫ్‌బీఐ అభియోగాలు.. ఎవరీ నాగ్రా?

Wait 5 sec.

అంతర్జాతీయ దోపిడీ ఆరోపణల కేసులో భారత పోలీస్ అధికారిపై అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అభియోగాలు నమోదుచేసింది. పంజాబ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ గురిందర్‌జిత్ సింగ్ నాగ్రాకు 4 లక్షల డాలర్ల దోపిడీ కేసులో సంబంధం ఉన్నట్టు అధికారులు ఆరోపించారు. అమెరికాలోని కుటుంబాలను లక్ష్యంగా చేసుకునే క్రిమినల్ ముఠాలు లారెన్స్ బిష్ణోయ్, జగ్గు భగవాన్‌పూరియా గ్యాంగులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. ఎఫ్‌బీఐ ఆరోపణలతో పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.ఎవరీ గురిందర్‌జిత్ సింగ్ నాగ్రా?పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలో ఉన్న టాండా పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)గా గురిందర్‌జిత్ సింగ్ నాగ్రా విధులు నిర్వహిస్తున్నారు. దర్యాప్తు చేస్తున్న ఒక దోపిడీ కేసులో ఆయనకు ప్రమేయం ఉందని సోషల్ మీడియాలో వార్తల నేపథ్యంలో ఆయనను వెంటనే హోషియార్‌పూర్‌లోని పోలీస్ లైన్స్‌కు బదిలీ చేయాలని సీనియర్ ఎస్పీ ఆదేశించారు. ముందస్తు చర్యగా ఆయనను బదిలీ చేశామని, ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించామని ఆయన తెలిపారు.ఎఫ్‌బీఐ అభియోగ పత్రంలో నాగ్రా పేరు ఉన్నట్లు వార్తలు రావడంతో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా విచారణను జలంధర్ రూరల్ ఎస్పీకి జలంధర్ రేంజ్ డీఐజీ అప్పగించారు. భారత్‌కు చెందిన ఒక వ్యవస్థీకృత నేర ముఠాలపై అమెరికా అభియోగపత్రంలో నాగ్రాకు సంబంధం ఉందని మీడియా నివేదికలు, సోషల్ మీడియా ద్వారా వస్తున్న వార్తలను పరిగణనలోకి తీసుకున్న పంజాబ్ పోలీసులు.. విచారణకు ఆదేశించారు. సంబంధిత వాస్తవాలు, ఆరోపణలన్నింటినీ పరిశీలించాలని విచారణ అధికారిని ఆదేశించారు. ఈ విచారణలో తేలే అంశాల ఆధారంగానే తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయని పంజాబ్ పోలీసులు తెలిపారు.‘ఆపరేషన్ హార్డ్ బాల్’ కింద ఓ అంతర్జాతీయ దోపిడీ వ్యవహారంపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేపట్టింది. నివేదికల ప్రకారం గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా ఒక భారతీయ జైలు నుంచి నేర ముఠాను నడిపాడని, పంజాబ్‌ పోలీసు అధికారి గురిందర్‌జిత్ సింగ్ కల్పిత హత్య కేసులో అమెరికాకు చెందిన ఒక కుటుంబాన్ని ఇరికించడానికి ప్రయత్నించాడని అభియోగపత్రం ఆరోపించింది. ఒక దోపిడీకి సంబంధించిన ఎఫ్‌బీఐ దర్యాప్తులో ఇతని పేరు కూడా ఉంది.భారత్‌లో జరిగిన తప్పుడు క్రిమినల్ విచారణలను సాకుగా చూపి బాధితులను బెదిరించి, వారి నుంచి 400,000 డాలర్లు వసూలు చేయడానికి ప్రయత్నించినట్టు ఆరోపించింది. అమెరికా అటార్నీ బిల్ ఎస్సేలీ మాట్లాడుతూ.. ఆ పోలీసు అధికారి ‘త్వరలోనే మా అదుపులో ఉంటాడు.. మేము అతనిపై అభియోగాలు మోపాం’’ అని ఆయన చెప్పారు. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియాతో ఆ పోలీస్ అధికారి సన్నిహితంగా పనిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు లారెన్స్ బిష్ణోయ్‌కు సహచరుడిగా ఉన్న భగవాన్‌ పురియా.. ఆ తర్వాత అతడికి ప్రత్యర్థిగా మారి పంజాబ్‌లో క్రిమినల్ నెట్‌వర్క్‌ను స్థాపించాడు. భగవాన్‌పురియా ముఠా భారత్ కేంద్రంగా అంతర్జాతీయ నేర సిండికేట్‌గా పనిచేస్తోందని, దీని సభ్యులు అమెరికా, కెనడా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో విస్తరించి ఉన్నారని అమెరికా న్యాయశాఖ పేర్కొంది.‘‘తమ ముఠాను విస్తరించుకోవడానికి భారత్‌లోని చట్ట అమలు అధికారులను లంచాలకు అలవాటుచేసింది.. దోపిడీలకు సహాయం చేయడంతో సహా అవినీతిపరులైన ప్రభుత్వ అధికారులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.. అంతేకాకుండా ఆరోపిత నేరాలకు సంబంధించి భారత్‌లోని చట్ట అమలు అధికారులకు ఇది తప్పుడు సమాచారాన్ని కూడా అందించింది’’ అని అమెరికా న్యాయ శాఖ తెలిపింది.