ఇంగ్లాండ్ ప్రధాన కోచ్‌ పదవికి బ్రెండన్ మెక్‌కల్లమ్ రాజీనామా చేశాడు. ఇటీవల జట్టు చెత్త ప్రదర్శనతో విమర్శల పాలైన మెక్‌కల్లమ్ ఆదివారం (జులై 12, 2026) తాను కోచ్‌గా వైదొలుగుతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. 2022 నుంచి బెన్ స్టోక్స్‌తో కలిసి 'బజ్ బాల్' క్రికెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన అతడు.. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. రోజుల వ్యవధిలోనే .. తప్పుకోవడం గమనార్హం.మెక్‌కల్లమ్ నిష్క్రమణ బాజ్ బాల్ శకానికి ముగింపు పలికినట్లయింది. మెక్‌కల్లమ్ 2022 నుంచి ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్‌గా ఉన్నాడు. 2025లో వైట్-బాల్ జట్లకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు."టెస్ట్ జట్టుకు కోచింగ్ ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టం. మేం కలిసి సాధించిన వాటిపై గర్వపడుతున్నా. ఈ కాలంలో ఎన్నో నమ్మశక్యంకాని విజయాలు, అదే సమయంలో కఠిన ఫలితాలు చూశాం. కానీ ఇదంతా ఆటలో భాగమే. టెస్ట్ జట్టుకు హెడ్ కోచ్ పదవిని అదృష్టం, గౌరవంగా భావిస్తున్నా. నా ఈ ప్రయాణంలో మాకు మద్దతు ఇచ్చిన ఆటగాళ్లు, సిబ్బంది, అభిమానులకు కృతజ్ఞతలు. ఇప్పుడు నా దృష్టి వైట్ బాల్ జట్లకు కోచింగ్ ఇవ్వడంపై ఉంటుంది" అని మెక్ కల్లమ్ తన ప్రకటనలో పేర్కొన్నాడు.2022లో ఇంగ్లాండ్ టెస్ట్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన మెక్‌కల్లమ్.. అప్పటి కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో కలిసి దూకుడైన ఆటకు శ్రీకారం చుట్టాడు. దీనికే'బజ్‌బాల్‌' అని పేరొచ్చింది. ప్రారంభంలో బజ్ బాల్ మెరుగైన ఫలితాలు ఇచ్చింది. న్యూజిలాండ్ (3-0), దక్షిణాఫ్రికా (2-1)తో సిరీస్‌లు గెలుచుకుంది. పాకిస్థాన్‌పై 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. కానీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో మాత్రం ఇప్పటివరకు ఫైనల్ చేరలేకపోయింది. ఇంగ్లాండ్ 2021-23 సైకిల్‌లో నాలుగో స్థానంలో, 2023-25 సైకిల్‌లో ఐదో ప్లేసులో నిలిచింది. ప్రస్తుతం 2025-27 స్టాండింగ్స్‌లో ఏడవ స్థానంలో ఉంది.ఇంగ్లాండ్ ఇటీవల టెస్టుల్లో పేలవ ఫలితాలు అందుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ 4-1తో యాషెస్‌లో పరాజయం పాలైంది. గత నెలలో న్యూజిలాండ్ చేతిలో 2-1 తేడాతో స్వదేశంలో టెస్టు సిరీస్ ఓడిపోయింది.