యాదాద్రి భువనగిరి జిల్లాలో రహదారి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆలేరు, భువనగిరి ప్రజలకు జరిగిన అన్యాయానికి ఫలితంగానే కాలు విరిగి ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణను భారీ అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. వంగపల్లిలో హ్యామ్ ఫేజ్-1 కింద రూ.339.59 కోట్ల వ్యయంతో 109.30 కిలోమీటర్ల మేర 7 రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్‌తో కేసీఆర్‌కు అప్పగిస్తే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని విమర్శించారు. గత పాలకులు నిర్లక్ష్యం చేసిన అభివృద్ధి పనులను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తోందన్నారు. బస్వాపూర్, గందమల్ల ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, కొంత ఆలస్యం జరిగినా ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని స్పష్టం చేశారు.తాను ఎంపీగా ఉన్న సమయంలో వంగపల్లి అండర్‌పాస్ కోసం కేంద్రంతో పోరాడి నిధులు తీసుకొచ్చానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తు చేశారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పనితీరును ప్రశంసిస్తూ.. ప్రజలు మరోసారి ఆయనను గెలిపిస్తే మంత్రివర్గంలో అవకాశం కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కొట్లాడి అయినా బీర్ల అయిలయ్యకు మంత్రి పదవి ఇప్పిస్తానని ప్రకటించారు. రాజకీయాల్లో పదవుల కోసం పోటీ కాకుండా ప్రజాసేవకే ప్రాధాన్యం ఇవ్వాలని నాయకులకు సూచించారు.ఇక.. రామన్నపేటలో హ్యామ్ ఫేజ్-1, ప్యాకేజ్-2 కింద రూ.358.18 కోట్లతో 210.10 కిలోమీటర్ల మేర 11 రహదారుల అభివృద్ధి పనులకు కూడా మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ రహదారులు పూర్తి అయితే గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడి రైతులు, విద్యార్థులు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి రహదారి మౌలిక వసతుల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.