ప్రపంచంలోనే అత్యంత వైభవంగా నిర్వహించే హిందూ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో పూరీ జగన్నాథ రథయాత్ర ఒకటి. ప్రతి ఏడాది ఒడిశాలోని పూరీ క్షేత్రానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తారు. జగన్నాథుడు, అన్నయ్య బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి భారీ రథాలపై ఆలయం నుంచి గుండిచా ఆలయానికి ఊరేగే ఈ యాత్ర భక్తి, సమానత్వం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ శుద్ధ విదియ రోజున ఈ పూరీ జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. ఈ ఏడాదిలో విదియ తిథి జూలై 15వ తేదీ ఉదయం 11:50 గంటలకు ప్రారంభమై.. జూలై 16 ఉదయం 8:52 గంటలకు ముగియనుంది. ఈ సందర్భంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి తమ తమ రథాలపై గుండిచా ఆలయానికి బయలుదేరుతారు. ఈ పవిత్ర యాత్రను ప్రత్యక్షంగా చూడడం లేదా రథాల తాళ్లను లాగడం వల్ల దైవానుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.ఇక.. రథయాత్రకు ముందు, తర్వాత జరిగే ప్రతీ ఆచారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. జూన్ 29వ తేదీన స్నానయాత్రలో దేవతలకు 108 పవిత్ర జలకలశాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఆ తర్వాత 15 రోజుల పాటు అనసార కాలంలో దేవతలు భక్తులకు దర్శనం ఇవ్వరు. జూలై 15వ తేదీన నబజౌబన దర్శన్ ద్వారా భక్తులకు తొలి దర్శనం కల్పిస్తారు. జూలై 20వ తేదీన హేరా పంచమి.. జూలై 24వ తేదీన తిరుగు ప్రయాణమైన బహుదా యాత్ర.. జూలై 25వ తేదీన బంగారు ఆభరణాలతో అలంకరించే సునా బేష.. జూలై 27వ తేదీన జరిగే నీలాద్రి బిజేతో జగన్నాథ రథోత్సవాలు ముగుస్తాయి.ప్రతి సంవత్సరం పవిత్ర వృక్షాలతో 3 భారీ చెక్క రథాలను కొత్తగా నిర్మిస్తారు. జగన్నాథుడి నందిఘోష రథం 16 చక్రాలతో సుమారు 45 అడుగుల ఎత్తులో ఉంటుంది. బలభద్రుడి తాళధ్వజ రథం ఆకుపచ్చ-ఎరుపు రంగుల అలంకరణతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. సుభద్రాదేవి దర్పదళన లేదా దేవదళన రథం 12 చక్రాలతో నలుపు-ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరించబడుతుంది.రథయాత్రలో పహండి బిజే ఆచారంలో ఆలయ అర్చకులు దేవతల విగ్రహాలను నృత్య భంగిమల్లో రథాల వద్దకు తీసుకొస్తారు. ఆ తర్వాత పూరీ గజపతి మహారాజు బంగారు చీపురుతో రథాలను శుభ్రం చేసే 'ఛేరా పహన్రా' ఆచారాన్ని నిర్వహిస్తారు. దేవుని ముందు అందరూ సమానమే అనే సందేశాన్ని ఈ ఆచారం తెలియజేస్తుంది. అనంతరం లక్షలాది మంది భక్తులు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయం వరకు రథాలను లాగుతారు.పూరీ జగన్నాథ ఆలయ గర్భగుడిలోకి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉన్నప్పటికీ.. రథయాత్రను మాత్రం అన్ని మతాల వారు, విదేశీయులు కూడా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. భారీగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అందువల్ల రథయాత్రకు వెళ్లే భక్తులు ముందుగానే హోటళ్లు, రవాణా సదుపాయాలను బుక్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. భక్తులందరికీ జగన్నాథుడి దర్శనం కల్పించాలనే సంకల్పంతో నిర్వహించే ఈ మహోత్సవం సమానత్వం, సేవాభావం, మోక్ష మార్గాన్ని చాటిచెప్పే అపూర్వ ఆధ్యాత్మిక వేడుకగా నిలుస్తోంది.