రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌ కోసం పోలీసులు గాలింపును మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే 10 ప్రత్యేక బృందాలతో కొనసాగుతున్న ఆపరేషన్‌ను 12 బృందాలకు విస్తరించారు. నిందితుడు రాష్ట్రం దాటి పరారై ఉండే అవకాశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని తెలంగాణతో పాటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అతడి ఆచూకీ కోసం సాంకేతిక ఆధారాలతో పాటు క్షేత్రస్థాయిలోనూ ముమ్మరంగా గాలిస్తున్నారు.దర్యాప్తులో భాగంగా రాజ్‌కుమార్‌ హత్యల అనంతరం కారులో పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అయితే చేగూరు సమీపానికి చేరుకునే సరికి కారులో పెట్రోల్‌ పూర్తిగా అయిపోవడంతో వాహనాన్ని అక్కడే వదిలేసి కాలినడకన తిమ్మాపూర్‌ రైల్వే ట్రాక్‌ వైపు వెళ్లినట్లు తేలింది. అక్కడ రైలు ముందు పడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినా, చివరి క్షణంలో వెనక్కి తగ్గి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.నిందితుడు అత్యంత పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు విచారణలో వెల్లడైంది. అతడి వద్ద మూడు మొబైల్‌ ఫోన్లు, 12కుపైగా సిమ్‌కార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సాంకేతిక నిఘా ద్వారా తనను గుర్తిస్తారనే ఉద్దేశంతో ప్రస్తుతం వాటిని ఉపయోగించడం లేదని భావిస్తున్నారు. అయినప్పటికీ అతడు వినియోగించిన అన్ని మొబైల్‌ నంబర్లను సైబర్‌ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.అదే సమయంలో బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్ల సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. జాతీయ రహదారి–44 వెంబడి ఉన్న హోటళ్లు, దాబాలు, లాడ్జీలు, విశ్రాంతి కేంద్రాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. రాజ్‌కుమార్‌కు తరచూ శ్రీశైలం వెళ్లే అలవాటు ఉందన్న సమాచారం నేపథ్యంలో అక్కడ కూడా ప్రత్యేక పోలీసు బృందాలను మోహరించారు. సాధువుల వేషంలో లేదా భక్తుల మధ్య తలదాచుకునే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.ఈ కేసులో రాజ్‌కుమార్‌ అత్యంత కిరాతకంగా వ్యవహరించినట్లు పోలీసులు వెల్లడించారు. తనపై పోక్సో కేసు నమోదుకు కారణమయ్యారనే కక్షతో ముందుగా బాలిక తల్లి, నానమ్మలను హత్య చేసిన అతడు, అనంతరం బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతుకోసి చంపాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి తన భార్యతో పాటు నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులను కూడా కత్తితో హత్య చేశాడు. కేవలం అరగంట వ్యవధిలో మూడు ప్రాంతాల్లో ఆరుగురిని హత్య చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.పరారీలో ఉన్న రాజ్‌కుమార్‌ను పట్టించిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి ప్రకటించిన ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ పోలీసులు, అతడి ఆచూకీ కోసం ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో షాబాద్‌ ఎస్సై రమేశ్‌ను కూడా ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.