విదేశాల్లో ఉన్న ఏపీవాసులారా.. ఈ అవకాశం వాడుకోండి.. ఎమ్మెల్సీ నాగబాబు

Wait 5 sec.

కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న SPECIAL INTENSIVE REVISION (SIR) ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని జనసేన నేత, ఎమ్మెల్సీ కోరారు. సోషల్ మీడియా ద్వారా వీడియో సందేశం విడుదల చేశారు. ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా, కచ్చితత్వం, సమగ్రంగా రూపొందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో చేపట్టిన గడువు త్వరలో ముగియనుందని నాగబాబు అప్రమత్తం చేశారు. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏం చేయాలనే దానిని ఇందులో వివరించారు. ఎన్నికల సంఘం నియమించిన బూత్ స్థాయి అధికారులు ( BLO ) అందరి ఇళ్ళకీ వచ్చి ఒక్కొక్క ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫారంలు ఇస్తారన్న నాగబాబు.. ఇప్పటికే చాలామందికి ఇవ్వడం జరిగిందన్నారు. ఒకవేళ ఇప్పటికీ మీకు ఎన్యుమరేషన్ ఫామ్‌లు రాకపోతే స్థానిక BLO ను సంప్రదించి ఫామ్ తీసుకోవాలన్నారు.ఎన్యుమరేషన్ ఫారంలో మీ పేరు, మీ గుర్తింపు కార్డు నంబరు, చిరునామా వివరాలతో పాటు మీ పాత ఫోటో ముద్రించి ఉంటుందని.. మిగతా వివరాలను మీరు నింపాలని సూచించారు. SIR ప్రక్రియలో 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా ప్రస్తుత ఓటర్ల జాబితాను పరిశీలించి లింక్ చేస్తున్నారని నాగబాబు వివరించారు. ఈ నేపథ్యంలో 2002 నాటి ఎన్నికల జాబితాలో మీ పేరు ఉంటే ఆ వివరాలు ఎన్యుమరేషన్ ఫామ్‌లో నింపాలని సూచించారు. అప్పటి జాబితాలో మీపేరు లేనట్లయితే మీ తల్లిదండ్రుల పేర్లు, మీ భర్త లేదా భార్య లేదా ఇతరత్రా కుటుంబీకులు, సంబంధీకుల పేర్లు ఎవరివైనా ఉంటే వాటి వివరాలను నమోదు చేయాలని నాగబాబు సూచించారు. అలాగే పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నంబర్, ఫోన్ నంబరు, మీ తల్లిదండ్రుల వివరాలు ఫామ్‌లో నింపి, కొత్త కలర్ ఫోటోలు అతికించి BLOకి అందజేయాలని నాగబాబు సూచించారు. రెండు ఫారాల మీద BLO సంతకం చేసి ఒకటి మీకు రసీదుగా ఇస్తారని... దాన్ని భద్రపరుచుకోవాలని సూచించారు. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు, విదేశాల్లో ఉన్న రాష్ట్ర ఓటర్ల కోసం ఆన్ లైన్ సదుపాయాన్ని సైతం ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందన్న నాగబాబు.. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేలా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ SIR ప్రక్రియలో పాల్గొని ఓటును భద్రపరుచుకోవాలని నాగబాబు విజ్ఞప్తి చేశారు. ప్రతి పౌరుడు తన ఓటుని రక్షించుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని.. సమాజంలో మార్పు తీసుకురావడానికి, మంచి పాలనను అందించడానికి ఓటు ఆయుధం వంటిదని సూచించారు. మీ ఓటు హక్కు ద్వారా నాయకులను ఎన్నుకుని అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.