శ్రీవారి భక్తులకు అలర్ట్.. అక్టోబర్ నెల దర్శనం కోటా విడుదల వివరాలివే..

Wait 5 sec.

ముఖ్య గమనిక. కోటా విడుదల వివరాలను తిరుపతి దేవస్థానం వెల్లడించింది. అక్టోబర్ నెలలో వివిధ దర్శనాలు, గదుల కోటా వివరాలను తెలిపింది. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల కోటాను జూలై 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయ‌నుంది. అలాగే ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 20 వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించేందుకు జూలై 20 నుంచి జూలై 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకూ సమయం ఉంది. మరోవైపు జూలై 21న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను జూలై 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. అలాగే తిరుమల శ్రీవారి వర్చువల్ సేవకు సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను జూలై 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమల అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను జూలై 23వ తేదీ ఉదయం 10 గంటలకు.. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను అదే రోజు ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.వృద్ధులు, దివ్యాంగుల దర్శనానికి సంబంధించిన ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లో కోటాను జూలై 23వ తేదీ మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తారు. అలాగే జూలై 24వ తేదీ ఉదయం పది గంటలకు రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. మరోవైపు శ్రీవారి దర్శనం, గదుల కోటా ఆన్ లైన్ బుకింగ్ కోసం అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in సందర్శించాలని.. తిరుమల శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ భక్తులను కోరింది.