అమరావతి: రైతులకు శుభవార్త.. రుణమాఫీ అమలుకు నిర్ణయం..

Wait 5 sec.

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన సీఆర్డీఏ 63వ అథారిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అభివృద్ధి అంశంతో పాటుగా అమరావతి కోసం రెండో దశ భూసమీకరణ.. రైతులకు చెల్లించాల్సిన యాన్యుటీ, రుణమాఫీ, వివిధ సంస్థలకు అమరావతిలో భూకేటాయింపులు, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు వంటి అంశాలపై సీఆర్డీఏ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈ వివరాలను ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ క్రమంలోనే అమరావతి రైతులకు శుభవార్త వినిపించారు. కొత్తగా భూసమీకరణ జరుగుతున్న గ్రామాలలో భూములు ఇచ్చే రైతులకు రుణమాఫీ చేయనున్నారు. ఈ మేరకు సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. జనవరి 6, 2026 లోపు తీసుకున్న వ్యవసాయ రుణాలకు ఇది వర్తించనుంది. మరోవైపు రెండో దశ ల్యాండ్ పూలింగ్‌లో అమరావతి కోసం భూములు ఇస్తున్న రైతులకు ఏటా ఎకరాకు రూ.40 వేలు చొప్పున యాన్యుటీ చెల్లించాలని సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. భూములు అప్పగించినప్పటి నుంచి పదేళ్లపాటు యాన్యుటీ చెల్లించేందుకు ఆమోదం తెలిపారు. జరీబు భూములు అయితే ఎకరానికి రూ.5 వేలు, మెట్ట భూములైతే ఎకరాకు రూ.3 వేలు చొప్పున ఏటా యాన్యుటీ మొత్తాన్ని పెంచాలని అథారిటీ సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. గ్రామ కంఠాలలో భూములు కోల్పోయిన రైతులకు ఏటా రూ.10 వేల చొప్పున చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అమరావతిలో 25 టౌన్ షిప్‌లు అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ప్రతి టౌన్ షిప్‌లో తప్పనిసరిగా ఒక ఇంట్నరేషనల్ స్కూల్ ఉండేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు వివరించారు. మరోవైపు అమరావతి నిర్మాణంలో భాగంగా.. ల్యాండ్ పూలింగ్‌ కింద భూములు ఇవ్వని వారికి మంగళవారం రోజు రాత్రి వరకూ సమయం ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. అప్పటికీ ఇవ్వని పక్షంలో బుధవారం నుంచి భూసేకరణ అమలు చేస్తామని స్పష్టం చేశారు. భూసేకరణ నోటిఫికేషన్‌ను 2.5 ఎకరాలకు కూడా అమలు చేయనున్నట్లు నారాయణ తెలిపారు.