తెలంగాణ పారిశ్రామిక రంగంలో మరో మైలురాయి ఆవిష్కృతం కాబోతోంది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత సమీపంలో.. కేవలం 20 కిలోమీటర్ల దూరంలో తుక్కుగూడ వద్ద సరికొత్త పారిశ్రామిక కారిడార్‌ శరవేగంగా సిద్ధమవుతోంది. హైదరాబాద్‌-శ్రీశైలం రహదారి మార్గంలో విస్తరించి ఉన్న హార్డ్‌వేర్‌ పార్క్‌-3లో పారిశ్రామిక నిర్మాణ పనులు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నూతన కారిడార్‌లో వైద్య విభాగాలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, విభిన్న రకాల పరిశ్రమలు, అంతర్జాతీయ స్థాయి ఆతిథ్య రంగాల కార్యకలాపాలకు వేదిక కానుంది.ఈ నూతన పారిశ్రామిక కారిడార్‌లో దేశీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన ఎనిమిది ప్రముఖ సంస్థలు ఏకంగా రూ.5,723 కోట్ల భారీ పెట్టుబడులు పెడుతున్నాయని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) శంషాబాద్‌ జోనల్‌ మేనేజర్‌ జ్యోతి వెల్లడించారు. ఈ పరిశ్రమలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 8,890 మంది నిరుద్యోగులకు ఆమె వివరించారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి భారత్‌ ఫ్యూచర్‌ సిటీ వరకూ ఉన్న మార్గమధ్యంలో ఐటీ, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు కోసం గత రెండేళ్లుగా ల్యాండ్‌ బ్యాంకులను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. ఫ్యూచర్‌ సిటీ ప్రాజెక్ట్ వేగం పుంజుకోవడంతో మహేశ్వరం, తుక్కుగూడ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బహుళజాతి సంస్థల ప్రతినిధులు నిరంతరం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు.హార్డ్‌వేర్‌ పార్క్‌-3లో పరిశ్రమలు స్థాపించేందుకు గత కొన్ని నెలలుగా ఏరోస్పేస్, హెవీ ఇంజినీరింగ్, గ్లోబల్ కళ్లద్దాల తయారీ సంస్థల వంటి జాతీయ, అంతర్జాతీయ దిగ్గజాలు టీజీఐఐసీ అధికారులకు ప్రతిపాదనలు అందజేశాయి. విమానాశ్రయ కనెక్టివిటీ, శ్రీశైలం హైవే రవాణా పరంగా తమ పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనుకూలంగా ఉంటుందని భావించిన కంపెనీలకు ప్రభుత్వం ఇక్కడ స్థలాలు కేటాయించింది. ఈ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఏరోస్పేస్‌ పార్కులు, రక్షణశాఖకు విడిభాగాలు సమకూర్చే కీలక రక్షణ రంగ సంస్థలు ఉన్నాయి. వీటికి తోడు ప్రపంచ ఐటీ దిగ్గజం అమెజాన్‌ సైతం తన కొత్త కార్యకలాపాలను ఇక్కడే ప్రారంభించడంతో మహేశ్వరం, తుక్కుగూడ ప్రాంతాలు అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక కారిడార్‌గా శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి.