రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే అయినప్పటికీ ఇటీవల కాలంలో నేతల మధ్య వ్యక్తిగత దూషణలు శృతిమించుతున్నాయి. తాజాగా ఒక ప్రముఖ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి .. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. లైవ్ డిబేట్‌లో రేవంత్ రెడ్డిపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన ఆయన.. సీఎం స్థానాన్ని అత్యంత చులకనగా చేసి మాట్లాడటం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.డిబేట్ సందర్భంగా నాగార్జున యాదవ్ మాట్లాడుతూ.. ఒక జొమాటో డెలివరీ బాయ్ అంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు. ఆయనకు ఒక ప్రభుత్వ జీవో చదవడం కూడా రాదని.. కనీసం ఎమ్మెల్యేగా గెలవడానికి కూడా పనికిరాడని.. వాడు, వీడు అని ఏకవచన పదాలతో తీవ్రంగా కించపరిచారు. ఈ క్రమంలో కార్యక్రమం హోస్ట్ జోక్యం చేసుకుని.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై అలాంటి పదజాలం ఉపయోగించవద్దని, గౌరవప్రదంగా మాట్లాడాలని పదేపదే వారించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని నాగార్జున యాదవ్.. రేవంత్ రెడ్డితో పోల్చి జొమాటో డెలివరీ బాయ్స్ స్థాయిని తగ్గించినందుకు సదరు డెలివరీ బాయ్స్‌కు క్షమాపణలు చెబుతున్నానంటూ మరింత వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, వివిధ పార్టీల మద్దతుదారులు భిన్నమైన అభిప్రాయాలతో విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక వర్గం నెటిజన్లు కారణాలు ఏవైనా కావచ్చు కానీ.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని పట్టుకుని ఇంత నీచంగా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి ముప్పు అని మండిపడుతున్నారు. వాక్ స్వాతంత్య్రం ఉందనడమంటే ఎంతకైనా తెగించడం కాదని, విమర్శలు పద్ధతిగా ఉండాలి కానీ ఇలాంటి నీచ సంస్కృతిని ఉపేక్షించకూడదని, వైసీపీ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి భాష వాడటం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే తీవ్ర నష్టం చేస్తుందని వారు హితవు పలుకుతున్నారు.మరొకవైపు కొంతమంది నెటిజన్లు ఈ విమర్శలను తిప్పికొడుతూ.. గతంలో విపక్షాలు అంతకంటే ఘోరంగా తిట్టినప్పుడు ఈ నీతులు ఎక్కడికి పోయాయని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు వైసీపీని గొడ్డలి పార్టీ, హంతకుల పార్టీ అని అన్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా బూతులు తిట్టలేదా అని నిలదీస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పార్టీలతో సంబంధం లేకుండా ఒక వ్యక్తి మరొకరిని దూషించడం ముమ్మాటికీ తప్పేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఎంతటి విద్యావంతులైనా, ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నా సభ్యసమాజంలో మాట్లాడేటప్పుడు కనీస పరిధులు దాటకూడదని ఆ పరిణితి లోపిస్తే సమాజానికే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఈ నియమం కేవలం వైసీపీ వర్గానికే కాకుండా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలతో పాటు అన్ని రాజకీయ పార్టీలకూ వర్తిస్తుందని కామెంట్లు పెడుతున్నారు.