: చాలా వరకు స్టాక్ మార్కెట్లలో కేవలం షేర్ ధర పెరగడంతోనే కాకుండా కంపెనీలు ప్రకటించే బోనస్ షేర్లు, డివిడెండ్, షేర్ల బైబ్యాక్, వంటి వాటితో అదనంగా లాభాలు పొందుతుంటారు ఇన్వెస్టర్లు. ఇక్కడ అదనపు పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. స్టాక్ స్ప్లిట్, బోనస్ ఇష్యూ కారణంగా షేర్ ధర తగ్గుతుంది. షేర్ల సంఖ్య పెరుగుతుంది. కానీ కనిష్ఠ స్థాయిల్లో షేర్లకు మళ్లీ కొనుగోళ్లు పెరుగుతాయని భావిస్తుంటారు. దీని వల్ల దీర్ఘకాలంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే చాలా వరకు దీర్ఘకాలం పాటు పెట్టుబడి కొనసాగించే వారికి ఈ ప్రయోజనాలు ఎక్కువగా దక్కుతుంటాయి. కానీ ఇప్పుడు స్టాక్ మార్కెట్ చరిత్రలో చాలా అరుదుగా జరిగే పరిణామం ఒకటి తెరపైకి వచ్చింది. మార్కెట్లో అడుగుపెట్టి కనీసం 10 రోజులు కూడా పూర్తి కాకముందే ఒక కంపెనీ తన ఇన్వెస్టర్లకు స్టాక్ స్ప్లిట్ ఆఫర్ ప్రకటించింది. దేశీయంగా పాపులర్ అయిన కార్డెలియా క్రూయిజెస్ బ్రాండ్‌ను నిర్వహించే వాటర్‌వేస్ లీజర్ టూరిజం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు శుక్రవారం రోజు సమావేశమై ఈ కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం వల్ల సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లకు అసలు ఎలాంటి లాభం చేకూరుతుంది. ఎప్పుడు లిస్ట్ అయింది. ఏ మేరకు లాభాలు వచ్చాయి. తెలుసుకుందాం. ఇదీ చూడండి: కంపెనీ బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ ప్రకటించింది. ఇక్కడ ఇన్వెస్టర్ దగ్గర ప్రతి ఒక్క షేరు 10 షేర్లుగా మారుతుంది. అంటే 100 షేర్లు ఉంటే 1000 షేర్లుగా మారతాయి. ప్రస్తుతం రూ. 10 గా ఉన్న షేర్ ముఖ విలువ రూ. 1 గా మారుతుంది. అంటే ఈ మేరకు స్టాక్ ధర తగ్గుతుంది. మార్కెట్లో షేర్ ధరను తగ్గించి సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇంకా ట్రేడింగ్ వాల్యూమ్స్ పెంచేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. స్టాక్ స్ప్లిట్ వల్ల కంపెనీలో షేర్ల సంఖ్య పెరుగుతుంది తప్ప కంపెనీ మొత్తం మార్కెట్ విలువలో, అంతర్గత విలువలో ఎలాంటి మార్పు ఉండదు.ఈ ఐపీఓ ఇటీవల జూన్ నెలలో రాగా జులై 1న ఎక్స్చేంజీల్లో లిస్టయింది. ఇష్యూ ధర రూ. 808 గా ఉండగా 16 శాతం డిస్కౌంట్‌తో రూ. 681 వద్ద లిస్టయి నష్టాల్ని ఇచ్చింది. అయితే తర్వాత వరుసగా దూసుకెళ్లి ఒక దశలో 33 శాతం వరకు పెరిగి రూ. 908.30 వద్ద ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. ప్రస్తుత మార్కెట్ ధర రూ. 859 వద్ద ఉండగా ఇది కూడా లిస్టింగ్ ప్రైస్‌తో పోలిస్తే దాదాపు 25 శాతానికిపైగా లాభాల్లోనే ఉంది. ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది దేశంలోనే అతిపెద్ద డొమెస్టిక్ ఓషన్ క్రూయిజ్ ఆపరేటర్. Disclaimer: పైన ఇచ్చింది సమాచారమే. పెట్టుబడికి సిఫార్సు కాదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించడం మంచిది.