ఏపీలోని ఆ స్టేషన్ నుంచి బెంగళూరుకు కొత్తగా వందేభారత్ రైలు.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ నరసాపురంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల రైలు ప్రయాణికులకు శుభవార్త. నరసాపురం నుంచి బెంగళూరు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై రెగ్యులర్‌గా మార్చారు. కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నరసాపురం–బెంగళూరు రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్‌ రైలును పాలకొల్లు రైల్వే స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. అంతేకాదు నరసాపురం ప్రాంతానికి మరిన్ని రైలు సౌకర్యాలు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను అన్నారు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ. నరసాపురం నుంచి బెంగళూరుకు వందే భారత్, అలాగే వారణాసి, విశాఖపట్నం వైపు కొత్త ఎక్స్‌ప్రెస్ సర్వీసుల కోసం కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయ్నారు. ఇప్పటివరకు స్పెషల్ సర్వీస్ గా నడిచిన నరసాపురం–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలును, రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌‌గా మార్చారు. ఈ మేరకు ప్రయాణికులకు దాదాపు 30% వరకు టికెట్ ఛార్జీల తగ్గింపు, మెరుగైన సమయపాలన అందుబాటులోకి రానున్నాయని కేంద్రమంత్రి తెలిపారు. ముఖ్యంగా నర్సాపురం ప్రాంతం నుంచి బెంగళూరుకు రాకపోకలు సాగించే ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, వేలాది మంది ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక సహకారంతోనే సౌత్ కోస్ట్ రైల్వే ద్వారా ఈ పురోగతి సాధ్యమైందన్నారు. ప్రస్తుతం నరసాపురం నుంచి చెన్నైకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది. గతంలో విజయవాడ వరకు నడుస్తున్న వందేభారత్‌ను నరసాపురం వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నరసాపురం నుంచి బెంగళూరుకు కొత్తగా వందేభారత్ రైలు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. అదే జరిగితే నరసాపురంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు.ఇటీవల నరసాపురం-అరుణాచలం వీక్లీ రైలును రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌గా అప్‌గ్రేడ్ చేసింది. నరసాపురం-అరుణాచలం వీక్లీ ఎక్స్‌ప్రెస్ నరసాపురంలో బయల్దేరి.. పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి రైల్వే స్టేషన్‌ల మీదుగా తిరువణ్ణామలై (అరుణాచలం)కు చేరుకుంటుంది. కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఏపీ నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు.