భర్త చేసిన తప్పుకు భార్యకు శిక్ష.. పొలంపల్లి సర్పంచ్‌ను సస్పెండ్ చేసిన మెదక్ జిల్లా కలెక్టర్

Wait 5 sec.

: మెదక్ జిల్లా స్థానిక రాజకీయం, పంచాయతీ పాలనలో అత్యంత సంచలనాత్మకమైన పరిణామం చోటుచేసుకుంది. ప్రజాప్రతినిధిగా ఉండి గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన సర్పంచ్ స్థానాన్ని.. ఆమె భర్త చేసిన అరాచకాలు, అక్రమ పనులు బలితీసుకున్నాయి. జిల్లాలోని చేగుంట మండలం పొలంపల్లి గ్రామ సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మిని ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ కఠిన ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచ్ భర్త చేసిన వికృత చేష్టలు, పంచాయతీ ఆస్తుల ధ్వంసం ఉదంతంపై విచారణ అనంతరం కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకోవడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ.. భర్త స్వామి అరాచకాలుపోలీసు, పంచాయతీ అధికారుల నివేదికల ప్రకారం.. పొలంపల్లి గ్రామానికి బీజేపీ తరఫున కొండి రాజ్యలక్ష్మి సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే సర్పంచ్‌ ఆమెనే అయినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారం చెలాయిస్తుంది మాత్రం ఆమె భర్త కొండి స్వామి. అలా ఏవో చిన్న చిన్న పనులు ఆయన చేస్తున్నారనుకుంటే పప్పులో కాలేసినట్లే. గ్రామ పంచాయతీ వ్యవహారాల్లో ఆయన తీవ్ర స్థాయిలో జోక్యం చేసుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా కొండి స్వామి పరిధి దాటి ప్రవర్తిస్తూ గ్రామంలో తీవ్ర ఆగడాలకు తెగబడ్డాడు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాటించిన హరితహారం మొక్కలను విచక్షణా రహితంగా పీకేయడం, ధ్వంసం చేయడం వంటి పనులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా గ్రామ పంచాయతీ కార్యాలయంలోని విలువైన ఫర్నిచర్‌ను బద్దలు కొట్టాడు. చివరకు ప్రజల సౌకర్యార్థం నిర్మించిన ప్రభుత్వ టాయిలెట్లను సైతం ధ్వంసం చేసి.. వాటికి తాళాలు వేయడం వంటి తీవ్ర అక్రమాలకు, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడు.ఆరు నెలల సస్పెన్షన్ విధించిన కలెక్టర్..గ్రామ సర్పంచ్ భర్త కొండి స్వామి ప్రభుత్వ ఆస్తులను నష్టపరుస్తూ, పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాడంటూ గ్రామస్థుల నుంచి, అధికారుల నుంచి జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారంపై స్పందించిన మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ తక్షణమే పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. విచారణలో కొండి స్వామి చేసిన అక్రమాలు, ధ్వంస రచన నిజమేనని ప్రాథమిక ఆధారాలతో సహా రుజువైంది. భర్త చేస్తున్న ఆగడాలను కట్టడి చేయడంలో సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి పూర్తిగా విఫలమయ్యారని కలెక్టర్ నిర్ధారించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ప్రభుత్వ ఆస్తుల నష్టానికి పరోక్షంగా కారణమైనందుకు గానూ, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ రాజ్యలక్ష్మిని ఆరు నెలల కాలం పాటు పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమసింగ్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.