: భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రూటు మార్చేసింది. ఒకవైపు అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ వృద్ధిని కొనసాగిస్తోంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ మంచి లాభాల్ని గడించింది. అంతకుముందు ఇదే సమయంతో పోలిస్తే సుమారు 5 శాతం వరకు పెరిగి రూ. 13349 కోట్లుగా వచ్చింది. ఆదాయం 14 శాతం మేర పుంజుకోగా ఇప్పుడు రూ. 72,275 కోట్లుగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ. 12 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కూడా టీసీఎస్ ప్రకటించింది. ఇదిలా ఉండగా గత కొన్ని త్రైమాసికాల్లో టీసీఎస్ సహా ఇతర దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఒకవైపు ఏఐ ఎంట్రీతో ఈ సంప్రదాయ ఐటీ సర్వీసులకు డిమాండ్ తగ్గుతుందన్న భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఆయా కంపెనీలు ఉద్యోగుల్ని తగ్గిస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు అనిశ్చితిలోనూ టీసీఎస్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా సరికొత్త ఏఐ స్కిల్స్ కలిగిన అభ్యర్థుల్ని భారీగా చేర్చుకుంటోంది. కిందటి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఒక్క క్వార్టర్‌లోనే నికరంగా టీసీఎస్‌లో 9279 మంది ఉద్యోగులు పెరిగారు. సంస్థలో మొత్తం ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 593798 కి చేరింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో హెడ్‌కౌండ్ రికార్డు స్థాయిలో 613069 గా ఉండేది. క్యూ3 కి వచ్చే సరికి ఈ సంఖ్య 5,82,163 కు పడిపోయింది. ఇప్పుడు మళ్లీ సంఖ్య పెరుగుతోంది. ఏఐ టాలెంట్‌ను పెంచే లక్ష్యంతో ఇదే సమయంలో దేశవ్యాప్తంగా క్యాంపస్ రిక్రూట్మెంట్లు (ప్రాంగణ నియామకాలు) కూడా నిర్వహిస్తోంది. ఇలా సమీక్షా త్రైమాసికంలో ఏకంగా 14 వేల మందికిపైగా ఫ్రెషర్లను చేర్చుకోవడం విశేషం.Read Also: ఇక 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే 25 వేల మందికిపైగా క్యాంపస్ ఆఫర్స్ ఇచ్చామని, డిమాండ్‌ను బట్టి ఈ సంఖ్యను మరింత పెంచుతామని సంస్థ సీఈఓ కృతివాసన్ తెలిపారు. ఏఐ వల్ల ఐటీ ఉద్యోగాలు తగ్గిపోతాయనే భయాల్ని టీసీఎస్ మేనేజ్మెంట్ కొట్టిపారేసింది. నాలెడ్జ్ వర్కర్స్ ఉపాధికి ఎలాంటి ఢోకా లేదని, అయితే ఉద్యోగాల శైలి మారబోతోందని స్పష్టం చేసింది. ఇప్పటికే కంపెనీలో 3.12 లక్షల మందికిపైగా అసోసియేట్స్ ఏఐ, మెషీన్ లెర్నింగ్‌లో ఉన్నత నైపుణ్యాలు సాధించినట్లు టీసీఎస్ పేర్కొంది. ఇంకా రాబోయే రోజుల్లో ప్రాంప్ట్ ఇంజినీరింగ్, మోడల్ ట్రైనింగ్, ఏఐ లైఫ్‌సైకిల్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో హైరింగ్ ఎక్కువగా ఉంటుందని సంస్థ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సుదీప్ కున్నుమల్ స్పష్టం చేశారు.