యూత్ రోజురోజుకూ కొత్తకొత్త దారుల్లో చెడు వ్యసనాలకు అలవాటు పడిపోతున్నారు. మాదక ద్రవ్యాలు, మందు‌తో పాటు ఇప్పుడు ఈ-సిగరెట్లు వైపు మళ్లుతున్నారు. చూడటానికి స్టయిల్‌గా ఉంటుంది.. తాగితే కిక్కిస్తుంది అని యువత ఈ-సిగరెట్లను ఎక్కువగా తాగుతున్నారు. పొగాకు ఉండదు, ఎలాంటి స్మోక్ రాదు కాబట్టి ఆరోగ్యానికి అంత హానికరం కాదని అందరూ అనుకుంటున్నారు.. కానీ అదే హెల్త్‌కి డేంజర్ అని గుర్తించలేకపోతున్నారు. ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ సిగరెట్ వాడకాలు పెరిగాయని పోలీసులు గుర్తించారు. పటమట, కష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్లను తాగుతున్న యువతను పోలీసులు గుర్తించారు. విద్యార్థులు కూడా ఈ - సిగరెట్లు తాగుతుండటంతో పోలీసులు అప్రమత్తమై తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇవ్వడం ప్రారంభించారు. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా అవగాహన కల్పిస్తున్నారు.READ ALSO ఆన్‌లైన్‌లో ఈ - సిగరెట్లు ఎక్కువ లభ్యమవుతున్నాయి. ఈ కమర్స్ ఎక్కువగా పెరగడంతో ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుని ఈ - సిగరెట్లను కొనుగోలు చేసి తాగుతున్నారని పోలీసులు గుర్తించారు. అయితే, పొగాకు వాడకం కంటే ఈ - సిగరెట్లే ఆరోగ్యానికి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. మనకు తెలియకుండానే ఈ - సిగరెట్ విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఈ - సిగరెట్లలో పొగాకు ఉత్పత్తుల నుంచి సేకరించిన లిక్విడ్ ఉంటుంది. దాన్నే ముడి సరుకుగా వాడతారు. రుచి, సువాసన కోసం ప్రొఫైలిన్ గ్లైకాల్ ఫ్లేవరింగ్ ఏజెంట్లు వాడుతుంటారు. ఈ రసాయనాలు ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కెమికల్స్, లిక్విడ్ కలిసి మనకు కంటికి కూడా కనిపించని చిన్న రేణువులు ఉంటాయని, అవి ఊపిరితిత్తుల్లోకి చేరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో జ్క్షాపకశక్తి తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. యువత ఇప్పటికైనా ఈ - సిగరెట్లు తాగడం ఆపేయాలని.. ఒకవేళ అలవాటు మానకపోతే థెరపీ తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. పోలీసులు కూడా నిఘా పెంచి ఈ - సిగరెట్లు తాగే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.