కూర్చొని పని చేసే వారికి హెచ్చరిక.. వర్కౌట్లు చేసినా, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువని తేల్చిన అధ్యయనం

Wait 5 sec.

మీరు రోజూ ఉదయాన్నే జిమ్‌కు వెళ్లడం లేదా వాకింగ్ చేయడం లేదా యోగా చేయడం లాంటివి చేస్తున్నారా? ఆ తర్వాత 8 నుంచి 10 గంటలపాటు కుర్చీకి అతుక్కొని పని చేస్తున్నారా? అయితే మీరు ఉదయాన్నే చేసే వర్కౌట్ ఏమాత్రం సరిపోదని ఓ అధ్యయనం చెబుతోంది. గంటల తరబడి వల్ల వచ్చే ప్రమాదం మరియు మరణించే ముప్పు ఎక్కువగా ఉందని ‘పీఎల్ఓఎస్ మెడిసిన్’ జర్నల్‌లో పబ్లిష్ అయిన ఓ అధ్యయనం వెల్లడించింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారికి సైతం ఈ ముప్పు ఉందని అధ్యయనం వెల్లడించడం గమనార్హం.రోజూ గంటల తరబడి కూర్చొని పని చేసే కోట్లాది మంది భారతీయులు, పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు ఈ పరిశోధన ఫలితాలు ఎంతో కీలకమని చెప్పొచ్చు. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 91 వేల మందిని 12 ఏళ్లపాటు పర్యవేక్షించారు. రోజూ నిరంతరాయంగా 30 నిమిషాల కంటే ఎక్కువ సేపు కూర్చొనే వారిలో క్యాన్సర్‌తో మరణించే ముప్పు ఎక్కువగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది. అలా కూర్చొనే సమయం అదనంగా ఓ గంట పెరిగే కొద్దీ క్యాన్సర్ రిస్క్ 10 శాతం పెరుగుతోందని పరిశోధకులు తెలిపారు.కూర్చొనే సమయానికి బదులు శారీరక శ్రమ చేస్తే క్యాన్సర్ రిస్క్ తగ్గుతోంది. ఒక గంటసేపు శారీరక శ్రమ చేస్తే క్యాన్సర్ ముప్పు 12 శాతం తగ్గుతుండగా.. అరగంటపాటు ఓ మాదిరి వ్యాయామం చేస్తే 8 శాతం, ఐదు నిమిషాలు కఠిన శారీరక శ్రమ చేస్తే 22 శాతం చొప్పున క్యాన్సర్ ముప్పు తగ్గుతున్నట్లు గుర్తించారు.‘‘పెద్దలు వారానికి 150-300 నిమిషాలు ఓ మాదిరి శారీరక శ్రమ చేయడంతోపాటు రోజంతా తరచూ కదులుతూ ఉండటం ముఖ్యం. గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వల్ల క్యాన్సర్ ముప్పు, క్యాన్సర్‌తో మరణించే ప్రమాదం పెరుగుతుంది’’ అని ఢిల్లీ ఎయిమ్స్‌లో రేడియేషన్ అంకాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేసే డాక్టర్ అభిషేక్ శంకర్ తెలిపారు.సుదీర్ఘ సమయం కూర్చోవడం వల్ల కండరాల కదలికలు తగ్గిపోతాయి, గ్లూకోజ్, ఫ్యాట్ మెటబాలిజం దెబ్బతింటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడంతోపాటు దీర్ఘకాలిక వాపు, బరువు పెరగడం, హార్మోన్ మార్పులు చోటు చేసుకుంటాయి. ‘కూర్చోవడం అనేది నేరుగా క్యాన్సర్‌కు కారణం కాదు. కానీ ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ, వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. దీని వల్ల కాలక్రమంలో పేగు, బ్రెస్ట్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ల ప్రమాదం పెరుగుతుంది. ఇతర అనారోగ్యకరమైన జీవనశైలి కారణాలు దీనికి మరింత ఊతం ఇస్తాయి’ అని డాక్టర్ అభిషేక్ శంకర్ తెలిపారు.ఈ పరిశోధన కోసం యాక్టివిటీ లెవల్స్‌కు సంబంధించిన కచ్చితమైన డేటాను ధరించగలిగే పరికరాల ద్వారా సేకరించారు. అయితే ఇది కేవలం పరిశీలనాత్మకమైన అధ్యయనం మాత్రమేనని.. ఇలా జరగడానికి కారణం ఏంటి, దాని ప్రభావం ఏంటనేది పూర్తిగా నిరూపించలేదని పరిశోధకులు తెలిపారు.గంటల తరబడి కూర్చోవడాన్ని తగ్గించడంతోపాటు.. కూర్చొనే సమయంలో బ్రేక్‌లు తీసుకోవడం ముఖ్యం అని పీఎస్ఆర్ఐ హాస్పిటల్‌లో హెమటాలజీ అండ్ అంకాలజీలో సీనియర్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్న డాక్టర్ అమిత్ ఉపాధ్యాయ్ తెలిపారు.‘‘డెస్ జాబ్స్ చేసే వారికి తరచుగా చిన్నపాటి విరామాలు తీసుకోవడం ముఖ్యం. ప్రతి 30-60 నిమిషాలకు ఒకసారి లేచి ఐదు నిమిషాలు నడవాలి. అవకాశం ఉంటే నిలబడి పని చేయాలి. ఫోన్లో మాట్లాడేటప్పుడు నడవటం లాంటివి చేయాలి. వర్క్ ఫ్రమ్ హోం చేసేవారు కదలడం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కాలక్రమంలో ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. తరచుగా చిన్నపాటి విరామాలు తీసుకొని అటు ఇటు తిరగడం అనేది రోజువారీ జీవితంలో ఎంతో ముఖ్యమైంది’’ అని డాక్టర్ అమిత్ ఉపాధ్యాయ్ తెలిపారు.