ఏపీలో డ్వాక్రా మహిళలకు నెలకు రూ.50వేల వరకు ఆదాయం.. ప్రభుత్వమే ఉచితంగా, పూర్తి వివరాలివే

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు రుణాలతో పాటుగా ఉచితంగా ఎగ్ కార్ట్స్ యూనిట్‌లు అందజేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం విడతలవారీగా ఈ ఎగ్‌కార్ట్‌లను అందజేస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో మహిళలకు ఎగ్‌కార్ట్‌లు అందజేయగా.. తాజాగా మూడో విడతలో ఎగ్‌కార్ట్‌లను అందించనున్నారు. ఈ ఎగ్‌కార్ట్‌లను పీపీపీ విధానంలో ఎన్‌ఈసీసీ (నేషనల్‌ ఎగ్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ) భాగస్వామ్యంతో అందజేస్తున్నారు. అర్హులను గుర్తించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు డీఆర్డీఏ అధికారులు.. ఆసక్తి ఉన్నవారు సెర్ప్, డీఆర్డీఏ అధికారుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.ఈ ఎగ్‌కార్టుల ద్వారా ఎగ్ రోల్, ఎగ్ నూడుల్స్, ఎగ్ బిర్యానీ, ఎగ్ ఫ్రై, ఆమ్‌లెట్, ఎగ్ 65, ఎగ్ పరోటా, ఎగ్ బోండా, ఎగ్ దోశ, ఎగ్ బజ్జీ, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ పెప్పర్ మసాలా, షాహి అండా మసాలా వంటకాలు అందుబాటులో ఉంటున్నాయి. డాక్టర్లు, న్యూట్రిషియన్లు కూడా రోజుకో ఎగ్ తింటే మంచిదని.. పోషకాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ ఎగ్‌కార్టులకు గిరాకీ పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా నగరాలు, పట్టణాలు, మేజర్ పంచాయతీలలో ఈ ఎగ్‌కార్టులు ప్రారంభమయ్యాయి.. మహిళలు వీటి ద్వారా ఆదాయం పొందుతన్నారు. ఇంటి దగ్గరే ఉంటూ ఆదాయం పొందడానికి ఈ బిజినెస్ బావుందంటున్నారు మహిళలు. అంతేకాదు కొంతమంది మహిళలు ప్రభుత్వం అందిస్తున్న రుణంతో పాటు స్త్రీనిధి నుంచి మరికొంత తీసుకుని కుటుంబంతో కలిసి ఈ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. ఇలా రోజుకు ఖర్చులు పోనూ రూ.1500 నుంచి రూ.2 వేల వరకు ఆదాయం వస్తోందని కొందరు మహిళలు చెబుతున్నారు. వాస్తవానికి నెలకు రూ.20వేల వరకు ఆదాయం వస్తుందని చెబుతున్నా.. కొందరు నెలకు రూ.50వేల వరకు ఆదాయం పొందుతున్నట్లు చెబుతున్నారు. దీంతో చాలామంది మహిళలు ఈ ఎగ్‌కార్టుల వైపు మొగ్గు చూపుతున్నారు.ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఉచితంగా రూ.50 వేల విలువైన ఎగ్‌ కార్ట్‌లను ఉచితంగా అందిస్తోంది. దీని కోసం గతేడాది నెక్‌ (ఎగ్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ)తో సెర్ప్‌ అధికారులు ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది మొదటి విడతగా ఎగ్‌కార్టుల్ని అందించింది.. రెండో విడత కూడా పూర్తిచేసి మూడ విడతకు సిద్ధమైంది. ఒక్కో ఎగ్‌కార్ట్ విలువ రూ.35 వేలు కాగా.. గుడ్లతో వివిధ రకాల వంటకాలు చేసేందుకు అవసరమైన రూ.15 వేల విలువైన వస్తు సామగ్రిని కూడా ఇస్తారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్యక్రమం విజయవంతం అయ్యింది. ఉదాహరణకు విజయనగరం జిల్లాలో తొలివిడతగా ఎగ్‌కార్టు యూనిట్లు 40 మందికి ఇచ్చారు. రెండో దశలో 25 మందికి మంజూరు చేయగా.. తాజాగా మూడో దశలో మరో 55 మందికి ఇవ్వాలని నిర్ణయించారు.