: భారతీయ స్టాక్ మార్కెట్లలో ఐపీఓల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. వరుసగా పెద్ద పెద్ద కంపెనీలు ఐపీఓలు ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ కాబోతున్నాయి. ఇటీవల పుంజుకున్నాక వచ్చిన అద్విత్ జువెల్స్ ఐపీఓ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించింది. సబ్‌స్క్రిప్షన్ ఊహించని రీతిలో జరగ్గా.. దానికి తగ్గట్లుగానే మంచి లిస్టింగ్ ప్రీమియం నమోదు చేసి ఇన్వెస్టర్లకు లాభాల్ని అందించింది. ఇప్పుడు ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్, రిలయన్స్ జియో, NSE, జెప్టో, ఓయో (ప్రిజమ్) ఇలా పెద్ద కంపెనీల నుంచి ఐపీఓలు క్యూలో ఉన్నాయి. వీటిల్లో అన్నింటికంటే ముందుగా రాబోతుంది.అయితే ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ జులై 14- 16 మధ్య నిర్వహించనుండగా.. ముందే సంచలనాలకు తెరలేపింది. ఐపీఓకు ముందే ఎస్బీఐ ఇక్కడ ఒక భారీ డీల్ ముగించింది. ప్రీ ఐపీఓ ప్లేస్‌మెంట్ కింద తన అసెట్ మేనేజ్‌మెంట్ విభాగంలోని కొంత వాటాను బడా సంస్థాగత ఇన్వెస్టర్లకు విక్రయించి వేల కోట్లు ఆర్జించింది. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ గరిష్ఠ ధర వద్దే ఈ డీల్ జరగడం మార్కెట్లో ఈ ఇష్యూకు ఉన్న క్రేజ్‌ను, విపరీతమైన డిమాండ్‌ను స్పష్టం చేస్తోంది.గురువారం రోజు ఎస్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం ఇక్కడ ప్రీ ఐపీఓ విక్రయం ఇలా సాగింది. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్‌లో ఎస్బీఐకి ఉన్న వాటాలో 1.42 శాతం వాటాను అమ్మేసింది. ఈ వాటా విక్రయంతో ఎస్బీఐ ఏకంగా రూ. 1655 కోట్ల మేర నిధుల్ని సొంతం చేసుకుంది. ఎస్బీఐ ఎంఎఫ్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ అప్పర్ ప్రైస్ అయిన రూ. 574 దగ్గరే ఈ డీల్ జరిగింది. ఇందులో భాగంగా ఏకంగా 2.88 కోట్ల షేర్లను విక్రయించింది.ఇక్కడ ఎస్బీఐ విక్రయించిన షేర్లను కొనుగోలు చేసిన వారిలో ప్రముఖ సంస్థాగత మదుపరులు ఉన్నారు. ప్రీ ఐపీఓ రౌండ్‌లో మొత్తం 30 మంది ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. దీంట్లో టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్, 360 వన్ ఫండ్స్, బెన్నెట్ కోల్మన్ వంటి దిగ్గజ సంస్థలతో పాటుగా పలు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్, ఫ్యామిలీ ఆఫీసులు కూడా ఉన్నాయి. ఈ ఐపీఓ విషయానికి వస్తే ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానంలో రాబోతుంది. ఎస్బీఐ, అముండీ ఇండియా తమ వాటాల్ని విక్రయిస్తోంది. వాటా విక్రయం ద్వారా సుమారు రూ. 11 వేల కోట్లకుపైగా నిధుల్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ధరల శ్రేణి రూ. 545 - 574 గా ఉండగా.. ఒక్కో లాట్ కింద కనీసం 26 షేర్లను కొనుగోలు చేయాలి. గరిష్ఠ ధర దగ్గర కంపెనీ మార్కెట్ విలువను రూ. 1.17 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.