భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టేకాఫ్‌కు రెడీ.. ఏరోడ్రోమ్‌ లైసెన్స్‌ వచ్చేసింది

Wait 5 sec.

భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. విమానాశ్రయం టేకాఫ్‌కు సిద్ధమంటూ పౌరవిమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ట్వీట్ చేశారు. ఢిల్లీలో జీఎంఆర్‌ సంస్థకు ఏరోడ్రోమ్‌ లైసెన్స్‌ను అందజేసిన విషయాన్ని తెలియజేశారు. ఈ ఏరోడ్రోమ్ లైసెన్స్ రావడంతో విమానాలు రాకపోకలు సాగించడానికి వీలుగా ఉంటుంది. అంతేకాదు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ప్రహరీ గోడ వెంటి సీసీ డ్రెయిన్ నిర్మాణానికి సంబంధించి నిధులు విడుదలయ్యాయి. ఈ మేరకు డ్రెయిన్ నిర్మాణానికి రూ.85 లక్షలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. అనంతరం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ ఎండీని ఆదేశించింది.'భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్‌ను అందజేయడం నాకు ఎంతో గర్వకారణం, ఆనందదాయకమైన క్షణం. ఈ లైసెన్స్ కేవలం ఒక విమానాశ్రయానికే కాదు.. ఉత్తరాంధ్రను 'ఉత్తమాంధ్ర'గా తీర్చిదిద్దే అభివృద్ధి యుగానికి నాంది. ప్రపంచ స్థాయి ఏరోట్రోపోలిస్ గా రూపుదిద్దుకుంటున్న భోగాపురం చుట్టూ ఎయిర్ కార్గో, విమాన నిర్వహణ (MRO) కేంద్రాలు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, బిజినెస్ పార్కులు, వాణిజ్య సముదాయాలు ఏర్పడి పెట్టుబడులు, ఉపాధి, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త దిశను చూపనున్నాయి. భోగాపురం ఇప్పుడు టేకాఫ్‌కు సిద్ధం' అంటూ రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. విమానాశ్రయం సిద్ధమైనా.. ప్రారంభోత్సవానికి ముహూర్తం మాత్రం ఫిక్స్ కాలేదు.ఉత్తరాంధ్ర ప్రజల కల నిజం కాబోతోంది.. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అత్యాధునిక వసతులతో.. ఎయిర్‌ బస్, బోయింగ్‌ విమానాలు ల్యాండ్ అయ్యేలా 3,800 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పున కేట్‌ ఐ -1 రన్‌వే ఉంది. ఏకంగా 5 వేల చ.మీ. విస్తీర్ణంలో 25 వేల టన్నుల సరకు రవాణా టెర్మినల్‌ కూడా ఉంది. ప్రయాణికుల కోసం అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయి.. చెక్ఇన్, బ్యాగేజ్ రీక్లెయిమ్, ఎయిర్‌లైన్స్ ఆఫీసులు, ఇమిగ్రేషన్, ఎమిగ్రేషన్, కమర్షియల్ స్పేస్, ఫుడ్, టికెట్ కౌంటర్స్, సిబ్బంది తనిఖీలు ఇలా అన్ని ఉన్నాయి. ఏటీసీ టవర్ ద్వారా 360 డిగ్రీల్లో ఏరో డ్రోమ్‌ విమాన సమాచార సేవలు ఉన్నాయి. 25 ఎకరాల్లో విమానాల నిర్వహణ, మరమ్మతుల సౌకర్యం కూడా ఉంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు కట్టుదిట్టమైన భద్రత కల్పించనున్నట్లు విశాఖపట్నం రేంజ్‌ ఐజీపీ గోపీనాథ్‌ జెట్టి తెలిపారు. ఆయన ఇటీవల ఎయిర్ పోర్టును సందర్శించి.. అక్కడ ఉన్న కమాండ్ కంట్రోల్, ఏటీసీ బ్యాగేజ్, ఇతర లాంజ్‌లను పరిశీలించి భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌తో విమానాశ్రయానికి అంతర్గత భద్రత కల్పిస్తున్నామన్నారు గోపీనాథ్ జెట్టి. విమానశ్రయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.