ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన 77వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు వైఎస్ జగన్, కుమార్తె షర్మిల ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. వైఎస్ జయంతి సందర్భంగా.. ఏపీలోని కాంగ్రెస్, వైఎస్సార్సీపీ నేతలతోపాటు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సైతం ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.తెలంగాణలో ప్రస్తుతం మంత్రులుగా కీలక స్థానంలో ఉన్న భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆయనకు నివాళులు అర్పించారు. వైఎస్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయాల్లో వీరికి అండగా నిలిచారు.కొండా మురళి, సురేఖ దంపతులకు వైఎస్ వెన్నుదన్నుగా నిలిచారు. 1999, 2004, 2009లో కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంలో రాజశేఖర రెడ్డి కీలక పాత్ర పోషించారు. 2009లో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖను సురేఖకు అప్పగించారు. వైఎస్ మరణం తర్వాత జగన్‌ను సీఎం చేయాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేసిన వారిలో కొండా సురేఖ ఒకరు. తర్వాత ఆమె కాంగ్రెస్‌ను వీడి జగన్ వెంట నడిచారు. పరకాల ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేశారు. ఆ తర్వాత ఆమె వైఎస్సార్సీపీని వీడి బీఆర్ఎస్‌లోకి తర్వాత కాంగ్రెస్‌లోకి వచ్చినప్పటికీ.. వైఎస్‌తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఆమె మర్చిపోలేదు.తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వైఎస్ రాజశేఖర రెడ్డిని తన రాజకీయ గురువుగా, మార్గదర్శిగా భావిస్తారు. వైఎస్ తరహాలోనే ఆయన పంచె కట్టులో కనిపిస్తారనే సంగతి తెలిసిందే. 2007లో భట్టి విక్రమార్కకు ఎమ్మెల్సీ పదవి దక్కడంలో వైఎస్ కీలక పాత్ర పోషించారు. 2009లో మధిర నుంచి పోటీ చేసిన భట్టి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ వెంటనే ఆయనకు ప్రభుత్వ విప్ పదవిని అప్పగించారు. వైఎస్ 2003లో చేపట్టిన పాదయాత్ర స్ఫూర్తితోనే భట్టి విక్రమార్క సైతం పీపుల్స్ మార్చ్ పేరిట తెలంగాణ వ్యాప్తంగా 1360 కి. మీ. పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికీ భట్టి నివాసంలోని పూజ గదిలో వైఎస్ చిత్రపటం ఉంటుంది. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడానికి ముందు కూడా ఆయన వైఎస్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాతే ఆయన రాజ్‌భవన్‌కు బయల్దేరి వెళ్లారు.ప్రస్తుత తెలంగాణ కేబినెట్లోని మరో కీలక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం వైఎస్ రాజశేఖర రెడ్డిని గురువుగా భావిస్తారు. వైఎస్ ఆయన్ను సొంత తమ్ముడిలా చూసుకునేవారు. 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేపట్టినప్పుడు వెంకట రెడ్డి ఆయనకు వెన్నంటి ఉన్నారు. 2004లో వైఎస్ సీఎం అయ్యాక.. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను కోమటిరెడ్డి బ్రదర్స్‌కు అప్పగించారు. 2009లో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకట రెడ్డికి కీలకమైన ఐటీ, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు సైతం వైఎస్ హయాంలోనే తొలిసారి మంత్రి అయ్యారు. 2004లో జూపల్లి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన జూపల్లికి వైఎస్ దేవాదాయ శాఖ బాధ్యతలు అప్పగించారు.ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన దామోదర రాజనర్సింహకు వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటి నుంచి అండగా నిలిచారు. 2004, 2009 ఎన్నికల్లో రాజనర్సింహ ఆందోల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దామోదర రాజనర్సింహకు వైఎస్ కేబినెట్లో ప్రాథమిక విద్యా శాఖ మంత్రిగా చోటు లభించింది. 2009లో గెలిచిన తర్వాత ఆయనకు మార్కెటింగ్ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. మంత్రిగా దామోదర రాజనర్సింహ మంచి పేరు తెచ్చుకోవడంతో.. వైఎస్ మరణం తర్వాత ఆయనకు ఉమ్మడి ఏపీలో డిప్యూటీ సీఎం, ఉన్నత విద్యా శాఖ మంత్రి పదవులు దక్కాయి.ప్రస్తుత రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సైతం వైఎస్ రాజశేఖర రెడ్డితో బలమైన అనుబంధం ఉంది. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని పొన్నం భావించారు. కానీ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెట్‌గా పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. అయితే పొన్నం ప్రభాకర్‌ను వైఎస్ తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. అంతే కాకుండా 2005లోనే ఆయనకు మార్క్‌ఫెడ్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. 2009 ఎన్నికల్లో పట్టుబట్టి పొన్నం ప్రభాకర్‌కు కరీంనగర్ ఎంపీ టికెట్ వచ్చేలా చూశారు. ఎంపీగా గెలిచిన తర్వాత పొన్నం ప్రభాకర్‌కు ఏపీ కాంగ్రెస్ ఎంపీల ఫోరమ్ కన్వీనర్ బాధ్యతలను అప్పగించారు.