ఏపీలో వారికి ఇకపై ప్రతి నెలా రూ.5వేలు కాదు రూ.10వేలు ఇస్తాం.. మంత్రి కీలక ప్రకటన

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూనియర్ లాయర్లకు తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్‌ లాయర్లకు ఇచ్చే స్టైఫండ్‌ రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతున్నామని.. త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు. అలాగే లా ఆఫీసర్ల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంపు, కొత్తగా 96 కోర్టుల ఏర్పాటు, 1770 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. రాష్ట్రంలో కోర్టు భవనాలు, జడ్జి క్వార్టర్లు, గెస్ట్‌హౌస్‌లు వంటి వాటికి రూ.216 కోట్లు కేటాయించామన్నారు. హైకోర్టులో కేసులు త్వరగా పరిష్కరించే దిశగా 245 పోస్టులకు సంబంధించి ఉత్తర్వులు ఇచ్చామన్నారు. హైకోర్టు జడ్జిలకు గ్రాట్యుటీ పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచామని మంత్రి గుర్తు చేశారు. హైకోర్టులోని ఏజీపీల గౌరవ వేతనాన్ని కూడా 25శాతం పెంచామన్నారు. స్పెషల్‌ జ్యుడిషియరీ మేజిస్ట్రేట్‌ల (సెకండ్‌ క్లాస్‌) గౌరవవేతనం రూ.30వేల నుంచి రూ.45 వేలకు పెంచి.. రవాణా ఖర్చుల కింద నెలకు రూ.5వేలు మంజూరు చేశామన్నారు.రాయలసీమవాసుల ఎన్నో ఏళ్లుగా కలగా ఉన్న అంశంపై ఏపీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ కీలక ప్రకటన చేశారు. కర్నూలులో త్వరలోనే ఏపీ హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైకోర్టు బెంచ్ కోసం కర్నూలులో స్థలం కేటాయించామన్నారు. మంత్రి రెండేళ్ల పాలనలో మైనారిటీ సంక్షేమశాఖ, న్యాయశాఖల పురోగతిపై కీలక ప్రకటన చేశారు. కర్నూలులో బెంచ్‌ ఏర్పాటుకు సంబంధించి హైకోర్టుతో అవసరమైన సంప్రదింపులు చేస్తున్నామన్నారు. అటు కేంద్రానికి కూడా హైకోర్టు బెంచ్ ప్రతిపాదనల్ని పంపామని చెప్పారు. ఈ ప్రక్రియలను త్వరలో పూర్తిచేసి హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఈ రెండేళ్లలో మైనార్టీ సంక్షేమానికి రూ.16,147.23 కోట్ల బడ్జెట్‌ కేటాయించినట్లు మంత్రి తెలిపారు. గత రెండేళ్లలో రూ. 9,759.70 కోట్లు ఖర్చు చేశామని.. రూ.4850.91 కోట్లు మైనార్టీల సంక్షేమ కార్యక్రమాల అమలుకు నేరుగా ఖర్చు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్రమణలకు గురైన 28 వేల ఎకరాల వక్ఫ్ భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు కోర్టుల్లో పోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పీఎంజేవీకే (ప్రధానమంత్రి జన్‌వికాస్‌) ద్వారా ముస్లింలకు సద్భావనా మండపాలు నిర్మిస్తామన్నారు. కర్నూలులో ఉర్దూ విశ్వవిద్యాలయంపై ఫోకస్ పెడతామన్నారు. రాష్ట్రంలో తాలీం-ఏ-హునర్‌ పథకం ద్వారా ముస్లిం విద్యార్థులకు ఇంటర్‌తో పాటు జేఈఈ, నీట్‌లకు ఉచితంగా రెసిడెన్షియల్‌ శిక్షణ అందిస్తున్నామన్నారు. హజ్‌యాత్రకు విజయవాడ ఎంబార్కేషన్‌ పాయింట్‌ నుంచి వెళ్లే యాత్రికులకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కడపలో చేపట్టిన హజ్‌హౌస్‌ను పూర్తిచేస్తామని.. అక్కడ మైనారిటీలకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటుచేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్నారు. అమరావతిలో హౌజ్‌హౌస్‌ నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తామన్నారు.