కస్టడీలోకి తీసుకున్న యువకుడిని చిత్రహింసలు పెట్టి చంపేశారు. పదిహేను సంవత్సరాల తర్వాత పాటు ఆ తల్లిదండ్రులు న్యాయం కోసం ఎదురుచూశారు. చివరకు ఆ నిరీక్షణకు తెరపడింది. 2011లో పోలీసు కస్టడీలో యువకుడు మరణించిన కేసులో మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా సెషన్స్ కోర్టు తొమ్మిది మంది పోలీసులకు జీవిత ఖైదు విధించింది. 2011 మే 10న మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలోని రిసోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని ఓ తెగకు చెందిన 23 ఏళ్ల బేగ్యా పవార్ అనే యువకుడిని పోలీసులు తెల్లవారుజామున 3 గంటల సమయంలో విచారణ పేరుతో ఇంటి నుంచి తీసుకెళ్లారు. అక్కడ పోలీసులు చిత్రహింసలు పెట్టడంతో కస్టడీలోనే మృతిచెందాడు. READ ALSO యువకుడు మరణించిన తర్వాత అతని తల్లిదండ్రులు అదే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు కంప్లెయింట్ తీసుకోలేదు. దాంతో పవార్ కుటుంబం, తమ సంఘం సభ్యులు కలిసి నిరసనలు చేపట్టి కేసు నమోదు చేయాలని, నిష్పక్షపాత విచారణ చేయించాలంటూ డిమాండ్ చేశారు. పోస్టుమార్టం, వైద్య పరీక్షల్లో బేగ్యా పవార్ శరీరంపై అనేక ఎముకలు విరిగినట్లు గుర్తించారు. దాంతో కస్టడీలో చిత్రహింసలు పెట్టారు అనే ఆరోపణలకు బలం చేకూరింది. తర్వాత కేసు దర్యాప్తును మహారాష్ట్ర సీఐడీకి అప్పగించారు. సీఐడీ అధికారులు సుదీర్ఘ విచారణ అనంతరం పోలీసులు కొట్టడం వల్లే పవార్ మరణించాడని పేర్కొంటూ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో దాదాపు 15 ఏళ్ల పాటు విచారణ సాగిన తర్వాత వాషిమ్ జిల్లా సెషన్స్ కోర్టు అప్పటి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి మహదేవ్ మాణిక్ ధాండేతో పాటు మొత్తం తొమ్మిది మంది పోలీసులను దోషులుగా తేల్చి జీవత ఖైదు విధించింది. వీరిలో ధాండేతో పాటు మరో పోలీసు అధికారి కూడా రిటైర్ అయ్యారు. ఈ 9 మందిని కూడా జైలుకు తరలించారు. తీర్పుపై స్పందించిన బేగ్యా పవార్ తల్లిదండ్రులు 15 ఏళ్ల తర్వాత తమ కుమారుడికి న్యాయం జరిగిందంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.