నేటి ఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో ఉద్యోగులు, ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య మానసిక ఒత్తిడి. డెడ్‌లైన్లు, నైట్ షిఫ్టులతో అలిసిపోయే ఐటీ యువత తమ వీకెండ్‌ను రీఛార్జ్ చేసుకోవడానికి గతంలో పబ్‌లు, లేట్ నైట్ పార్టీలు, మల్టీప్లెక్స్ సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. కేవలం వినోదమే కాకుండా మెదడుకు పదును పెట్టే, వ్యూహాత్మక ఆలోచనలను రేకెత్తించే సరికొత్త మైండ్ గేమ్‌ల వైపు యువత మొగ్గు చూపుతోంది. ఈ సరికొత్త ట్రెండ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఐటీ హబ్ పరిధిలోని హైటెక్ సిటీ, మాధాపూర్ ప్రాంతాలలో ఈవెంట్లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మైండ్‌స్పేస్‌ పరిసరాల్లోని ప్రముఖ కేఫేలు, సోషల్‌ లాంజ్‌లు వారాంతాల్లో ఈ మైండ్ గేమ్‌లకు ప్రధాన వేదికలుగా మారుతున్నాయి.ఈ మాఫియా నైట్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడికి వచ్చేవారంతా ఒకరికొకరు ముందే పరిచయం ఉన్న వ్యక్తులు కాదు. పూర్తిగా అపరిచిత వ్యక్తులు ఒకచోట చేరి, గ్రూపులుగా ఏర్పడి ఈ ఆటను ఆడుతుంటారు. ఈ గేమ్‌లో వ్యూహాత్మక ఆలోచనలు, సమయస్ఫూర్తి, బాడీ లాంగ్వేజ్, అద్భుతమైన నటన అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఎవరు నిజం చెబుతున్నారు, ఎవరు అబద్ధంతో బురిడీ కొట్టిస్తున్నారు అని కనిపెట్టే క్రమంలో సాగే వాదోపవాదాలు, సరదా నిందారోపణలు యువతకు మైండ్ బ్లోయింగ్ అనుభూతిని ఇస్తున్నాయి. ఇది కేవలం మానసిక ఒత్తిడిని దూరం చేయడమే కాకుండా.. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి, కార్పొరేట్ నెట్‌వర్కింగ్ పెంచుకుంటూ కొత్త స్నేహితులను సంపాదించుకోవడానికి ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.ఈ మాఫియా గేమ్‌లో కనిష్టంగా 7 గురి నుంచి గరిష్టంగా 24 మంది వరకు పాలుపంచుకోవచ్చు. ఆట ప్రారంభించడానికి ముందు ఆటగాళ్లంతా కలిసి ఒక వ్యాఖ్యాతను ఎన్నుకుంటారు. ఆ తర్వాత మిగతా ఆటగాళ్లకు చీటీలు లేదా కార్డుల ద్వారా రహస్యంగా పాత్రలను కేటాయిస్తారు. ఇందులో మాఫియా పాత్రలో ఉన్నవారు రహస్యంగా నగర ప్రజలను ఒక్కొక్కరిగా ఆట నుంచి తొలగిస్తుంటారు. కాగా, నగరవాసుల పాత్రలు పొందిన వారు తమ మధ్యే దాగున్న మాఫియా కిల్లర్స్ ఎవరో కనిపెట్టడానికి ప్రయత్నిస్తారు. వీరితో పాటు డిటెక్టివ్‌ లేదా పోలీసులు ఉంటారు, వీరు తాము అనుకున్న వ్యక్తి మాఫియా అవునో కాదో వ్యాఖ్యాతను సైగల ద్వారా అడిగి తెలుసుకుంటారు. ఇక డాక్టర్ పాత్రలో ఉన్నవారు మాఫియా దాడి నుంచి ఎవరినైనా ఒకరిని కాపాడేందుకు ప్రయత్నిస్తారు.ఈ మాఫియా నైట్స్ సంస్కృతి కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర ప్రధాన మెట్రో నగరాల్లోనూ జోరందుకుంది. బెంగళూరు సిలికాన్ వ్యాలీలోని ఐటీ కేఫ్‌లు ఈ ఈవెంట్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుండగా.. వారాంతపు ఒత్తిడిని దూరం చేసుకోవడానికి టెక్కీలు అక్కడ పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. అలాగే ముంబయ్‌లోని జుహూ, అంధేరి వంటి పాష్ ప్రాంతాల్లోని లగ్జరీ గేమింగ్‌ క్లబ్‌లలో మాఫియా నైట్స్‌ను డిజిటల్, వినూత్న శైలిలో నిర్వహిస్తున్నారు. మరోవైపు దిల్లీలోని స్పెషలిస్ట్‌ గేమ్‌ కేఫ్‌లు, క్లబ్‌లు రాత్రివేళల్లో ఈ సరికొత్త సోషల్ గేమింగ్ ఈవెంట్లకు ప్రత్యేక ఆతిథ్యం ఇస్తూ భారీగా యువతను ఆకర్షిస్తున్నాయి.