లోన్లపై అదనపు వడ్డీ బాదుడు- ప్రభుత్వ దిగ్గజ బ్యాంకుకు షాకిచ్చిన ఆర్బీఐ- మరో సంస్థపైనా చర్యలు!

Wait 5 sec.

: బ్యాంకింగ్ రంగంలో కస్టమర్ల హక్కుల్ని కాపాడటం, నిబంధనల్ని పక్కాగా అమలు చేయడంలో ఆర్బీఐ మరోసారి కఠినంగా వ్యవహరించింది. తాజాగా ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటుగా మరో ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కు కేంద్ర బ్యాంక్ గట్టి షాక్ ఇచ్చింది. కేవైసీ మార్గదర్శకాల్ని ఉల్లంఘించడం సహా రుణ దాతల ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్‌ను ఉల్లంఘించినందుకు ఈ రెండు సంస్థలపై కలిపి రూ. 66.7 లక్షల మేర భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అసలు ఇవి చేసిన తప్పేంటి. దీని వల్ల కస్టమర్లపై ఏమైనా ప్రభావం పడుతుందా? పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్బీఐ నిర్వహించిన చట్టబద్ధమైన తనిఖీల్లో కింది నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. కొంత మంది కస్టమర్ల లోన్ అకౌంట్లలో ఒప్పందం కుదుర్చుకున్న వడ్డీ రేటు కంటే ఎక్కువ వడ్డీ రేటును బ్యాంక్ వసూలు చేసినట్లు ఆర్బీఐ గుర్తించింది. ఇది ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్‌కు పూర్తిగా విరుద్ధంగా ఉంది. కొంత మంది కేవైసీ రికార్డుల్ని నిర్ణీత కాల పరిమితిలోగా సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీ‌కి అప్‌లోడ్ చేయడంలో బ్యాంకు విఫలమైంది. ఈ కారణాలతోనే బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ. 63.6 లక్షల జరిమానా విధించింది. ఇదే సమయంలో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) జరిపిన తనిఖీల ఆధారంగా జీఐసీ సంస్థపైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంది. ఇక్కడ సంస్థ తన కస్టమర్ల అకౌంట్ల రిస్క్ వర్గీకరణను కనీసం 6 నెలలకు ఒకసారి క్రమానుగతంగా సమీక్షించే పక్కా వ్యవస్థను ఏర్పాటు చేయడంలో విఫలమైంది. ఈ కేవైసీ నిబంధనల ఉల్లంఘనకు గానూ ఆర్బీఐ దీనిపై రూ. 3.1 లక్షల ఫైన్ వేసింది. అయితే కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జరిమానాలు కేవలం బ్యాంకుల అంతర్గత నిబంధనల లోపాల ఆధారంగానే విధించారు. దీని వల్ల కస్టమర్ల సాధారణ బ్యాంకింగ్ సేవలకు లేదా వారు బ్యాంకులో చేసిన డిపాజిట్లు, ఎఫ్‌డీలకు సంబంధించిన వాటిపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది.