మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి.. ముఖ్యమంత్రి మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో తన రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా నిర్వహించిన కృతజ్ఞత సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్‌కు భవిష్యత్తులో అధికారం దక్కే అవకాశం లేదని స్పష్టం చేశారు. అరుంధతి సినిమాలోని పశుపతి పాత్రను ప్రస్తావించిన రేవంత్ రెడ్డి.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అరుంధతి సినిమాలో పశుపతిని గొలుసులతో బంధించినట్లే.. 4 కోట్ల తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌లో బంధించారని పేర్కొన్నారు. ఇక ఫామ్‌హౌస్‌లోనే కేసీఆర్ కుంగి కృశించి పోవాలని.. అధికారం అనేది వారికి గతమని.. బీఆర్ఎస్‌కు మళ్లీ అధికారం అనేది కేవలం కల మాత్రమే అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు చేపట్టినా కేసీఆర్.. ప్రజా సమస్యలపై మాట్లాడడం లేదని, కానీ అధికారం కోసం మాత్రం బయటకు వస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.తనకు అనుభవం లేదంటూ గతంలో విమర్శలు చేసిన వారిపైనా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పందించారు. పేద కుటుంబంలో పెరిగిన తనకు ప్రజల సమస్యలు బాగా తెలుసని చెప్పారు. తట్ట పనికి, మట్టి పనికి పాలమూరు బిడ్డ పనికొస్తాడు కానీ పరిపాలనకు పనికిరాడా అంటూ నిలదీశారు. దొరల అహంకారాన్ని ప్రజలు ఓడించాల్సిన బాధ్యత ఇంకా ఉందని అన్నారు.బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి.. 10 ఏళ్లలో భారీగా అప్పులు చేసినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు చేయలేదని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, దళితులకు 3 ఎకరాల భూమి, కోటి ఎకరాలకు సాగునీరు వంటి హామీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన రైతులు, దళితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజాపాలన ఎందుకు పోవాలి.. ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వం ఎందుకు మారాలి అనే అంశంపై గ్రామాల్లో చర్చలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. 10 ఏళ్ల పాలనలో వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దీర్ఘకాలం అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుందని అన్నారు. బీఆర్ఎస్‌కు గతం మాత్రమే ఉందని.. భవిష్యత్తు లేదని మరోసారి స్పష్టం చేశారు.