తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి సాయి భగీరథ్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయొద్దని తెలంగాణ హైకోర్టుకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పోక్సో కేసులో దర్యాప్తు కీలక దశలో కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ సమయంలో నిందితుడు బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేస్తే.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో పాటు విచారణకు ఆటంకం కలిగే ప్రమాదం ఉందని పేట్‌ బషీరాబాద్ పోలీసులు.. హైకోర్టులో దాఖలు చేసిన తమ కౌంటర్ అఫిడవిట్‌లో స్పష్టం చేశారు.పేట్‌ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ విజయవర్ధన్ క్రిమినల్ పిటిషన్ నంబర్ 9986/2026లో తెలంగాణ హైకోర్టుకు కౌంటర్ దాఖలు చేశారు. క్రైమ్ నంబర్ 684/2026 కింద తొలుత భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లు 74, 75తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 11, 12 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత దర్యాప్తులో లభించిన ఆధారాలు, వైద్య నివేదికల ఆధారంగా పోక్సో చట్టంలోని సెక్షన్ 5(ఎల్)తో పాటు సెక్షన్ 6, అలాగే బీఎన్‌ఎస్ సెక్షన్ 64(2)(ఎం)ను కేసులో చేర్చినట్లు వివరించారు.మరోవైపు.. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మే 9వ తేదీన బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా, స్కూల్ రికార్డుల ప్రకారం ఆమె వయస్సు 17 ఏళ్లు మాత్రమేనని.. ఆమె మైనర్ అని నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. బాధితురాలితో స్నేహం పేరుతో బండి భగీరథ్ పరిచయం పెంచుకుని.. మానసికంగా ప్రభావితం చేశాడని పోలీసులు ఆరోపించారు. 2025 నుంచి పలుమార్లు శ్రీరామ్ గార్డెన్స్‌లోని బాధితురాలి నివాసం, నానక్‌రామ్‌గూడలోని గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్లు సహా పలు ప్రాంతాల్లో లైంగిక దాడులకు పాల్పడినట్లు బాధితురాలి వాంగ్మూలంలో వెల్లడైందని కోర్టుకు వివరించారు.బాధితురాలు మైనర్ కావడం, కేసులోని ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, ఈ పరిస్థితుల్లో నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బెదిరించడం లేదా ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలని కోరారు. ఇక బండి భగీరథ్ గత 45 రోజులుగా రిమాండ్‌లో ఉన్నారని.. కోర్టు విధించే అన్ని షరతులను పాటిస్తూ విచారణకు సహకరిస్తారని.. శుక్రవారం రోజున జరిగిన విచారణలో ఆయన తరఫు న్యాయవాది వాదించారు. మరోవైపు బాధితురాలి వాంగ్మూలం ప్రతులు ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది కోరగా.. అవి ఇప్పటికే కోర్టుకు సమర్పించామని, వాటి కాపీలు అందించడం సాధ్యం కాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. దీంతో ఈ కేసులో బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.