విరాజ్ అశ్విన్, యశశ్రీ జంటగా వినోద్ గాలి తెరకెక్కించిన సిరీస్ ‘’. ఈ సిరీస్‌లో సిద్దు పవన్, గోపీనాథ్, వైవా రాఘవ్ ప్రధాన పాత్రలను పోషించారు. ఇక టీజర్, ట్రైలర్‌లో చూపించినట్టుగా నోస్టాల్జిక్ ఫీలింగ్‌ను సిరీస్ కలిగించిందా? లేదా? అన్నది చూద్దాం.కథసంతోష్ (విరాజ్ అశ్విన్) తన స్కూల్ డేస్‌లో హెడ్ మాస్టర్ రఘునాథ్ (ప్రియదర్శిని రామ్) కూతురు వైశాలి (యశశ్రీ)ని ప్రేమిస్తాడు. కానీ సంతోష్ అతని ఫ్రెండ్స్ శ్రీకాంత్ (సిద్దు), ఆనంద్ (హరినాథ్), గణేష్ (వైవా రాఘవ్) స్కూల్లో చేసే అల్లరి పనులతో హెడ్ మాస్టర్ చేత ప్రతీ రోజూ తన్నులు తింటూనే ఉంటారు. ఇక పెద్దయ్యాక సంతోష్, వైశాలి కలిసి రఘునాథ్‌ను పెళ్లికి ఒప్పిస్తారు. తన కూతురి కోసం సంతోష్ చాలా వరకు మారిపోయాడని గ్రహిస్తాడు రఘునాథ్. కానీ చిన్నతనంలో సంతోష్ చేసిన ఓ తప్పుకి ఎప్పుడైతే సారీ చెప్తాడో అప్పుడే మనస్పూర్తిగా అల్లుడిగా అంగీకరిస్తానని రఘునాథ్ అనుకుంటాడు. ఇంకో వైపు బ్యాచిలర్ పార్టీ అంటూ సంతోష్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి గోవాకు బయల్దేరుతాడు. మార్గ మధ్యలోనే ఓ యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ ప్రమాదంలో సంతోష్ గతాన్ని మర్చిపోతాడు. మరి సంతోష్‌కి మళ్లీ గతం గుర్తుకు వస్తుందా? సంతోష్ ఎక్కడ ఎలా తప్పు చేసి దొరుకుతాడా.. అని చూస్తున్న రఘునాథ్‌కి ఈ విషయం తెలుస్తుందా? తెలిస్తే ఏం చేస్తాడు? సంతోష్ తన గతంలో చేసిన ఆ తప్పు ఏంటి? మరి ఈ జర్నీలో సంతోష్‌కి అతని స్నేహితులు, ప్రేయసి తోడుగా ఎలా నిలిచారు? చివరకు ఏం జరిగింది? అన్నదే కథ.గుర్తుకొస్తున్నాయి.. కొత్త కథ కాదు.. మన జీవితాన్ని మళ్లీ ఓ సారి తిరగేసి చూసుకునేలా చేసే కథ.. మనల్ని మనం ఒకసారి గుర్తు చేసుకునేలా చేసే కథ. 90స్ కిడ్స్‌కి టార్గెట్ చేస్తూ ఈ మధ్య కథలు ఎక్కువగా వస్తున్నాయి. 1990, 2000 బ్యాక్ డ్రాప్‌లో తీసే కథల్లో సోల్ ఎక్కువ మందికి కనెక్ట్ అవుతూ ఉంది. ఇక ఈ ‘గుర్తుకొస్తున్నాయి’ కథలోనూ 90స్ కిడ్స్‌కి ఓ రీఫ్రెషింగ్‌గా, రీకాలింగ్‌లా ఉంటుంది. ఇలాంటి ఓ ఆహ్లాదకరమైన, హాయిని కలిగించే, సంతృప్తినిచ్చే కథను రాసుకుని.. మనసులకు హత్తుకునేలా తీసిన దర్శకుడు వినోద్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.సంతోష్ పరిచయం, ప్రేమ కోసం పడే పాట్లు, బాధ్యత గల కుర్రాడిలా మారడం.. రఘునాథ్ చివరకు పెళ్లి ఒప్పుకోవడం వంటి సీన్లతో మెల్లిగా సిరీస్ సాగుతుంది. ఫ్రెండ్స్ అందరూ ఒక్క చోటకు చేరడం, మధ్యలో యాక్సిడెంట్ అవ్వడంతో కథలో కాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆ తరువాత గతాన్ని మర్చిపోవడం, అక్కడ సంతోష్ పాత్రతో పుట్టించే కామెడీ, ఫ్రెండ్స్‌ కవర్ చేసే తీరు ఇలా అన్నీ ఫన్నీగా సాగుతుంటాయి. ఇక చివరి రెండు ఎపిసోడ్స్ చాలా భారంగా, గుండెని బరువెక్కించేలా సాగుతాయి. క్లైమాక్స్ మాత్రం మనసుకి హాయిని, సంతృప్తిని ఇస్తుంది. కడుపు నిండా తృప్తిగా భోజనం చేస్తే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో.. సిరీస్ ఎండ్ అయ్యే సరికి అలాంటి ఓ ఫీలింగ్ కలుగుతుంది.ఓ కథకి స్టార్టింగ్, కాన్ ఫ్లిక్ట్, ఎండింగ్ ఎంత అద్భుతంగా ఉంటే.. ఆడియెన్స్‌ అంత ఎక్కువగా రిసీవ్ చేసుకుంటారు. అందుకే క్లైమాక్స్‌ని సంతృప్తినిచ్చేలా చూసుకుంటారంతా. ఈ కథకి అలాంటి ఓ సంతృప్తికరమైన ముగింపు కనిపిస్తుంది. ఇక రెండో సీజన్‌కి ఎలాంటి మలుపుల్ని తీసుకు వస్తారో.. ఎలాంటి కథను తీసుకుంటారో చూడాలి. ఇక ఈ సిరీస్‌లోని టెక్నికల్ టీం ఓ మ్యాజిక్ చేసినట్టుగా అనిపిస్తుంది. అజయ్ అరసాడ పాటలు, బీజీఎం గుండెల్ని తాకుతుంది. విజువల్స్ ఎంతో సహజంగా అనిపిస్తాయి. మాటలు చాలా వరకు మనసులో నాటుకుంటాయి. ఎడిటింగ్, ఆర్ట్, కాస్ట్యూమ్ ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ మ్యాజిక్ చేస్తాయి.నటీనటుల విషయానికి వస్తే విరాజ్ అశ్విన్, గోపీ, వైవా రాఘవ్, సిద్దు పాత్రలు లైవ్‌లీ, నేచురల్‌గా ఉంటాయి. వారి యాక్టింగ్ కూడా బాగుంటుంది. ఇక వారి బాల్యానికి సంబంధించిన సన్నివేశాల్లో కనిపించిన చిన్న పిల్లలు ఎంతో సహజంగా నటించారు. యశశ్రీ పాత్ర కూడా మెప్పిస్తుంది. ప్రియదర్శిని రామ్ లుక్స్, యాక్టింగ్ మెప్పిస్తాయి. అనీష్ కురివిల్లా, గోపరాజు రమణ, రోహిణి హట్టంగడి, శివన్నారాయణ ఇలా అన్ని పాత్రలు గుర్తుండిపోతాయి. హీరో బంధువుల పాత్రలు కూడా చాలా వరకు మెప్పిస్తాయి.ఓవరాల్‌గా ‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్‌ని చూసే 90స్ బ్యాచ్‌కి కచ్చితంగా తమ పాత రోజులు గుర్తుకు వస్తాయి. బాల్య స్నేహితులు, స్కూల్ లైఫ్, ఒకప్పుడు గడిపిన రోజులు, అద్భుతమైన క్షణాలు అన్నీ గుర్తుకొస్తాయి. ఇక ఈ సిరీస్‌లో కొంత వరకు 90స్, భలే భలే మగాడివోయ్ ఛాయలు కనిపించినా.. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని హాయిగా నవ్వుకుని, ఎంజాయ్ చేసేలా సిరీస్ ఉంటుంది.