హైదరాబాద్‌లోని బాచుపల్లిలో దారుణ ఘటన వెలుగుచూసింది. మద్యం తాగడం మానేయాలని చెప్పిన భార్యను భర్త హత్య చేసి.. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే.. మృతురాలి కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో అసలు విషయం బయటపడటంతో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును ఆత్మహత్య నుంచి హత్య కేసుగా మార్చి విచారణ కొనసాగిస్తున్నారు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాచుపల్లి ప్రాంతానికి చెందిన కిలారు బాలకృష్ణ.. 10 రోజుల క్రితం తన భార్య భార్గవిని అతి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు సృష్టించాడు. ఇదే విషయాన్ని వారి బంధువులకు చెప్పి వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే వారికి అనుమానం వచ్చింది. పోలీసుల ప్రాథమిక విచారణలోనూ అదే కథ చెప్పి.. దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు.అయితే.. మృతురాలు భార్గవి సోదరుడికి బావ కిలారు బాలకృష్ణకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసును లోతుగా విచారించిన పోలీసులు బాలకృష్ణను ప్రశ్నించారు. విచారణలో అతడు అసలు విషయాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో వెలుగుచూసిన వివరాల ప్రకారం.. బాలకృష్ణ తరచూ మద్యం సేవించి భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో మద్యం మానేయాలని భార్గవి పలుమార్లు కోరింది. దీంతో తీవ్ర కోపానికి గురైన బాలకృష్ణ.. తనను మందు మానేయాలని చెప్పడానికి నువ్వు ఎవరు అంటూ భార్యపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడు బాలకృష్ణను అరెస్ట్ చేసిన బాచుపల్లి పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. జడ్జి ఆదేశాలతో అతడిని రిమాండ్‌కు తరలించారు. తొలుత అనుమానాస్పద మృతి.. ఆత్మహత్య కోణంలో నమోదు చేసిన కేసును హత్య కేసుగా మార్చి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.