ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. 191 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 190 రన్స్ చేసింది. అనంతరం ఇంగ్లాండ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. మూడో టీ20 జులై 7న ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరగనుంది.మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అరంగేట్ర ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 రన్స్ చేశాడు. ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 49 రన్స్‌), అభిషేక్ శర్మ (24 బంతుల్లో 43 రన్స్‌), శ్రేయస్ అయ్యర్ (22 బంతుల్లో 37 రన్స్‌) సత్తాచాటారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు తొలి ఓవర్‌లోనే డబుల్ షాక్ తగిలింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్‌ను అర్షదీప్ సింగ్ డకౌట్‌గా పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్ క్రీజులో ఉన్నంత సేపు ఎదురుదాడికి దిగాడు. 15 బంతుల్లో 39 పరుగులు చేశాడు. టామ్ బాంటన్ (32 బంతుల్లో 39 రన్స్‌), క్రీజులో ఉండటంతో ఇంగ్లాండ్ కోలుకుంది.16 ఓవర్లలో ఇంగ్లాండ్ స్కోరు 142/5గా ఉంది. అప్పటికి ఇంకా 24 బంతుల్లో49 పరుగులు కావాలి. ఈ సమయంలో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. జాకబ్ బెథెల్ 36 బంతుల్లో 42 రన్స్ చేసి క్రీజులో ఉన్నాడు. కానీ వేసిన ఈ ఓవర్‌ను మ్యాచ్‌ను ఇంగ్లాండ్ వైపు తిప్పింది. ఈ ఓవర్‌లో అతడు N1 6 N 6 2 4 6 2 గణాంకాలు నమోదు చేశాడు. ఏకంగా 29 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత కూడా బెథెల్ జోరు కొనసాగించడంతో 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఇంగ్లీష్ జట్టు విజయం సాధించింది. బెథెల్ 46 బంతుల్లో 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.