‘నన్ను అడ్డుకోవాలంటే.. నన్ను చంపాల్సిందే’.. రెబల్స్‌పై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

Wait 5 sec.

పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ.. ఏమాత్రం తగ్గడం లేదు. ఆ పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేల్లో మెజార్టీ సంఖ్య రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని రెబల్స్‌ వర్గం ఏర్పడటం, లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుతో ‘అసలైన తృణమూల్ ఎవరు?’ అనే వివాదానికి తెరలేపింది. ఈ నేపథ్యంలో తన రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసిరిన దీదీ.. ‘నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నన్ను ఆపడం మీవల్ల కాదు’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.రెబల్స్‌ను దోహ్రులుగా అభివర్ణించిన .. తనవైపు ఉన్నవారికే తృణమూల్ గుర్తు దక్కతుందని స్పష్టం చేశారు. దీంతో రెబల్స్ చట్టపరమైన సుదీర్ఘ పోరాటాన్ని ఎదుర్కోవాల్సి ఉంంటుందని పరోక్షంగా తేల్చిచెప్పారు. ‘‘పార్టీ గుర్తు ఎక్కడికీ పోదు.. నన్ను ఆపాలనుకుంటే.. నన్ను చంపాల్సిందే’’ అని పేర్కొన్నారు.దీదీకి అత్యంత నమ్మకస్థురాలిగా గుర్తింపు పొందిన చంద్రమా భట్టాచార్య టీఎంసీ బెంగాల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, రెబల్స్ వర్గంలో చేరారు. దీనిపై కూడా మాజీ సీఎం స్పందించారు. ‘చంద్రిమా భట్టాచార్య ఈ రోజు రాజీనామా చేశారు.... ఇదివరకు ఆమె కొడుకు రెబల్స్‌తో చేతులు కలపడం వల్ల తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో తాను కూడా రాజీనామా చేస్తానని ముందే సమాచారం ఇచ్చారు’ అని అన్నారు.అలాగే, తిరుగుబాటు వర్గం తనకు ఆఫర్ చేసి ‘సలహాదారు’ పాత్రను దీదీ తిరస్కరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను వారితో చేతులు కలపబోనని స్పష్టం చేశారు. ‘రాజీనామా చేయడం అనేది ఆమె ఇష్టం.. కానీ, నేను మాత్రం వారితో చేతులు కలపను’ అని అన్నారు. ఒత్తిడికి లొంగిపోయే తిరుగుబాటుదారులు పార్టీకి ద్రోహం చేశారని ఆరోపించారు. ‘కానీ, నేను బీజేపీ ముందు తలవంచను.. నా పార్టీ ఏ రకమైన ఒత్తిడికి లొంగదు’’ అని ఉద్ఘాటించారు... ‘‘నిన్న టీఎంసీ కార్యాలయానికి వెళ్లి దానికి తాళం వేసిన వారికి నేను చెప్పేది ఒకటే.. మేము ఆ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నాం... అక్టోబర్ 2027 వరకు దానిని మాకు లీజుకు ఇచ్చారు... ఒక వ్యక్తి పార్టీని వీడొచ్చు, కానీ సంస్థ ఉనికిలో లేకుండా పోదు. అది పార్టీ ఆస్తి. నేను కూడా దానిని అంత సులభంగా స్వాధీనం చేసుకోలేను.. 'మా, మతి, మనుష్ (తల్లి, భూమి, ప్రజలు)' అనే ఆస్తిని ఎవరూ బలవంతంగా లాక్కోలేరు’’ అని ఆమె అన్నారు.తమ పార్టీ సిద్ధాంతం అధికార పార్టీకి పూర్తిగా వ్యతిరేకమని మాజీ ముఖ్యమంత్రి అన్నారు. ‘‘ఆ గుర్తును ఇచ్చింది నేనే.. 2026 ఎన్నికలలో మీ నామినేషన్లపై సంతకం చేసింది నేనే.. ఎన్నికలు ముగిసిన రెండు నెలల్లో మీరు ఎలా ద్రోహులుగా మారారు? దైనికైనా ఓ హద్దు ఉండాలి.. మీరు ఇప్పుడు బీజేపీతో ఉన్నారు.. ఇది ఎల్లకాలం సాగదు.. ఎందుకంటే తృణమూల్ సిద్ధాంతం బీజేపీ వ్యతిరేకం’’ అని ఆమె అన్నారు. ఇక, చంద్రిమా రాజీనామా నేపథ్యంలో టీఎంసీ జాతీయ, రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను తానే స్వయంగా స్వీకరించినట్టు దీదీ ప్రకటించారు. అంతేకాదు, తన నివాసమే టీఎంసీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుందని తెలిపారు.