ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. పురుషులకు కూడా.. ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్!

Wait 5 sec.

హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ () మరో వినూత్న సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నగర ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గిస్తూ, ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు పుష్పక్ ఏసీ ఫీడర్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. ఈ కొత్త విధానం ప్రకారం హైదరాబాద్–బెంగళూరు సూపర్ లగ్జరీ బస్సులకు టికెట్ బుక్ చేసుకునే సమయంలో శంషాబాద్ (ఎయిర్‌పోర్టు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్)ను బోర్డింగ్ పాయింట్‌గా ఎంపిక చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ ఉచిత సౌకర్యం వర్తిస్తుంది. వారు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏసీ, పుష్పక్ ఎయిర్‌పోర్ట్ లైనర్ ఏసీ ఫీడర్ బస్సుల్లో శంషాబాద్ వరకు ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా ప్రయాణించవచ్చు. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సులో తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ప్రస్తుతం ఈ ఫీడర్ సర్వీసులు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. నగరంలోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్), సికింద్రాబాద్, ప్రకాశ్‌నగర్, పర్యాటక భవన్, కేర్ హాస్పిటల్ (బంజారాహిల్స్), ఎన్ఎండీసీ, మెహదీపట్నం, ఆరాంఘర్, మియాపూర్, నిజాంపేట్ ఎక్స్ రోడ్స్, జేఎన్‌టీయూ, మలేషియా టౌన్‌షిప్, శిల్పారామం, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి ఓఆర్‌ఆర్, లింగంపల్లి, మదీనాగూడ, ఆల్విన్ ఎక్స్ రోడ్స్, హఫీజ్‌పేట్, కొండాపూర్, కొత్తగూడ ఎక్స్ రోడ్స్, బొటానికల్ గార్డెన్ వంటి ప్రాంతాల నుంచి ఈ సేవలు నడుస్తాయని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.హైదరాబాద్‌లోని పశ్చిమ, ఉత్తర ప్రాంతాల నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు సాధారణంగా నగర ట్రాఫిక్ కారణంగా బస్సు ఎక్కేందుకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు సులభంగా శంషాబాద్ బోర్డింగ్ పాయింట్‌కు చేరుకునేలా ఈ ప్రత్యేక ఫీడర్ సేవలను ప్రారంభించింది.ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందాలంటే ప్రయాణికులు బెంగళూరు బస్సు టికెట్‌ను ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక ఆన్‌లైన్ బుకింగ్ యాప్ ద్వారా బుక్ చేసుకుని, బోర్డింగ్ పాయింట్‌గా Shamshabad (Opp. RGIA Traffic Police Station)ను తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాలి. ప్రయాణ రోజున తమ రిజర్వేషన్ టికెట్‌ను చూపించి పుష్పక్ ఏసీ ఫీడర్ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రయాణికులకు సమయం ఆదా చేయడంతో పాటు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించడమే ఈ కొత్త ఏర్పాట్ల ప్రధాన లక్ష్యమని టీజీఎస్‌ఆర్టీసీ తెలిపింది. హైదరాబాద్–బెంగళూరు మార్గంలో ప్రయాణించే వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.