ఆంధ్రప్రదేశ్‌లో చర్చ తెరపైకి వచ్చింది. 2029 ఎన్నికల్లో మావిగన్ ఎజెండాతో ప్రజల్లోకి వెళతామని మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కూటమి పార్టీలు కూడా అప్పుడు మూడు రాజధానులు, ఇప్పుడు మావిగన్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని జగన్‌కు కౌంటర్‌ ఇస్తున్నాయి. తాజాగా అమరావతి వర్సెస్ మావిగన్‌ అంశంపై మాజీ ఎంపీ స్పందించారు. ఈ రెండు అంశాలపై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారుఅంటోందని.. ఒక బాధ్యత కలిగిన ఒక పౌరుడిగా రెండు రాజకీయపార్టీలు చేస్తున్న భిన్న అర్థరహిత వాదనలు చూసిన తర్వాత తన అభిప్రాయాలను అందరితో పంచుకుంటున్నాను అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎక్కడ ఏర్పాటుచేయాలనే అంశంపై గతంలో శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన నివేదికను వీరంతా ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. 2014లో రాష్ట్ర విభజన జరిగిందని.. 12 ఏళ్లు అవుతున్నా సరే ఇంకా రాజధాని ఎక్కడ ఉండాలనే చర్చ జరుగుతోందని.. ఇది అందరూ సిగ్గుపడాల్సిన విషయమన్నారు. రాష్ట్రం విడిపోయిన 15 ఏళ్ల తర్వాత.. అంటే 2029లో మరోసారి సార్వత్రిక ఎన్నికలు రానున్నాయని.. ఆ ఎన్నికల్లో కూడా రాజధాని ఎక్కడ ఉండాలో ప్రజలు మరోసారి నిర్ణయించాలా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజధాని పేరుతో చేస్తున్న ఈ పొలిటికల్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను ఆపేయాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీదా ఉందా? లేదా? అన్నారు. అమరావతిలో మొదటి విడతలో ల్యాండ్‌ పూలింగ్‌కు రైతులకు భూములు ఇచ్చారని.. కానీ ఇప్పటికీ వారికి ప్లాట్లు అప్పగించలేదని, అసలు కేటాయింపులు చేయలేదని.. దీనిని ఎలా సమర్థించుకుంటారని.. లక్ష ఎకరాలు రాజధానికి ఏం చేసుకుంటారని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. వీజీటీఎం కాన్సెప్ట్‌ (విజయవాడ–గుంటూరు–తెనాలి–మంగళగిరి) విభజన చట్టంలోనే ఉందని.. ఈ ప్రాంతం అంతటికీ రాజధాని భవనాలను విస్తరిస్తే అందులో పోయేది ఏం ఉంటుందని ప్రశ్నించారు విజయసాయి.ప్రధానంగా రాజధాని నిర్మాణం పేరుమీద అవినీతి జరుగుతోందని.. కూటమి ప్రభుత్వం రాజధాని కోసం ఏకంగా రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నార విజయసాయి. అమరావతిలో జరుగుతున్న ప్రతి నిర్మాణంలో భారీగా నిర్మాణ వ్యయాన్ని పెంచి చూపించారని ఆరోపించారు. దీన్ని బట్టి రాజధానిలో అవినీతికి పథకం వేస్తున్నారని.. అందుకే అమరావతి అనే అందమైన పేరు పెట్టారన్నారు. అమరావతిని దేవతల రాజధాని అంటూ బ్రహ్మాండమైన అబద్ధపు బ్రాండింగ్‌ ఇచ్చారన్నారు. నేరుగా అధికారంలో ఉన్న వారు ఈ దేవతల రాజధాని బ్రాండింగ్‌ వాడుకుంటూ 25 నుంచి 30 శాతం డబ్బును లంచాలుగా తీసుకుంటున్నారని ఆరోపించారు. వాస్తవానికి అమరావతిలో ఉన్న అమరేశ్వరుడి ఆలయం, బుద్ధ విగ్రహం ఉన్న అమరావతికి.. ఇప్పుడు నిర్మాణం చేస్తున్న బిల్డింగులు ఉన్న ప్రాంతం 50 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. అమరావతి దైవ క్షేత్రం, కృష్ణమ్మ ప్రవహిస్తున్న క్షేత్రం అయితే.. ఈ అమరావతి అవినీతి పారుతున్న క్షేత్రం అని ఘాటుగా స్పందించారు. 'అమరావతి బిల్డింగుల నిర్మాణానికి ఏకంగా రూ 50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు అందులో 25–30 శాతం అవినీతికి ఆస్కారం కనిపిస్తున్నప్పుడు.. ఈ అవినీతిని మనమంతా ప్రజలుగా మొదట ప్రశ్నించాలి. అంటే ఇది దాదాపు 15 వేల కోట్ల లంచాల మేతకు వేసిన పథకం. మరి ఈ విషయాన్ని వదిలేసి మావిగన్‌ అనటం వల్ల ప్రయోజనం ఏమిటి? మరో మూడేళ్ళలో జరిగిపోయే నిర్మాణాలన్నీ ఏం చేద్దాం? రాజధానిని నిర్మించటం అంటే అవినీతికి బాగా ఆస్కారం ఉన్న బిల్డింగులు ఏ పార్టీ కట్టాలి... ఎంత కమీషన్లు కొట్టాలి అన్నది కాదు కదా?. కాబట్టి, అమరావతి పేరిట జరుగుతున్న అవినీతి యజ్ఞాన్ని ప్రజలందరి తరఫున ప్రశ్నిస్తూ, ఎస్కలేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో అవినీతిని సవాలు చేస్తూ త్వరలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.