ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో ఊహించడం చాలా కష్టం. నిన్నటి వరకూ ఓ లెక్కన సాగిన రాజకీయం.. నేటి ఉదయానికి మరోలా మారిపోతుంది. అధికార టీడీపీ కూటమి, విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్‌లో.. "క్రెడిట్" అనే అంశం చాలా కీలకంగా మారుతోంది. ఏ అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి అయినా మేమంటే మేమే కారణమనే వైఖరి పార్టీలలో కనిపిస్తోంది. మొన్నటి గూగుల్ డేటా సెంటర్ మొదలుకుని.. నేటి వరకూ పొలిటికల్ పార్టీలు ఈ" క్రెడిట్"ను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉండగా.. ఆయా పార్టీల మద్దతుదారులు సోషల్ మీడియాలో వీటిని హోరెత్తిస్తున్నారు. అసలు విషయానికి వస్తే.. వైఎస్సార్ నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు ఈ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రెండు దశాబ్దాల రాయలసీమ ప్రజల కల ఈరోజు నెరవేరిందన్నారు. సున్నపురాళ్లపల్లిలోప్రారంభించి ఈ కలను నిజం చేశామని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో కేవలం శంకుస్థాపనలతో సరిపెట్టి ప్రజలను మభ్యపెడితే... మేం పనులు మొదలుపెట్టి రాయలసీమ స్టీల్ ప్లాంటుకు వాస్తవరూపం ఇస్తున్నామని పనిలోపనిగా వైసీపీపైనా విమర్శలు చేశారు. 2028 నాటికి కడప స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు చంద్రబాబు.వైఎస్ జగన్ ట్వీట్.. కడపలో స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. సజ్జన్ జిందాల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్ బృందానికి అభినందనలు తెలిపారు. రాయలసీమ అభివృద్దికి ఈ ప్రాజెక్టు కీలకమైన మైలురాయిగా జగన్ అభివర్ణించారు. యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఎన్నో ఏళ్ల కృషి, ప్రణాళిక అనే పునాదులపై ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మితమవుతాయన్న వైఎస్ జగన్.. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టుకు కీలకమైన పునాదులు వేశామన్నారు. పర్యావరణ అనుమతులు, నీటి కేటాయింపు, భూముల కేటాయింపు, రహదారుల అనుసంధానం వంటి మౌలిక సదుపాయాల కోసం భూమిని అందించామన్నారు. ఈ కారణాలతోనే ప్రాజెక్టు వేగంగా కదిలిందన్న జగన్.. కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా ఈ ప్రాజెక్టు పనులు నిలిపివేసిందని ఆరోపించారు. ఇప్పటికైనా పనులు ప్రారంభం కావటం సంతోషకరమంటూ జేఎస్‌డబ్ల్యూ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.జగన్‌కు థ్యాంక్స్ చెప్పిన సజ్జన్ జిందాల్మరోవైపు జగన్ చేసిన ట్వీట్‌కు సజ్జన్ జిందాల్ రిప్లై ఇచ్చారు." మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు, జగన్ గారు..మీ ప్రభుత్వ హయాంలో లభించిన ప్రారంభ అనుమతుల నుంచి నేటి ఈ ప్రారంభోత్సవం వరకు సాగిన ఈ ప్రయాణం నిరంతర కృషికి నిదర్శనం. ఈ ప్రాంత యువత, కుటుంబాల కోసం ఈ ప్రాజెక్ట్‌ను వేగంగా పూర్తి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము." అంటూ జిందాల్ ట్వీట్ చేశారు.మంటపెట్టిన జిందాల్ ట్వీట్..అయితే సజ్జన్ జిందాల్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో టీడీపీ వర్సెస్ వైసీపీగా మారుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతుల ద్వారానే కడప స్టీల్ ప్లాంట్ సాధ్యమైందని స్వయంగా జిందాల్ చెప్పారని వైసీపీ మద్దతుదారులు ట్వీట్లు చేస్తున్నారు. జగన్ హయాంలో వేగంగా ఇచ్చిన అనుమతులతోనే ఈ ప్రాజెక్టు కల సాకారమవుతోందని.. టీడీపీ ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని విమర్శిస్తున్నారు. అయితే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన నీరు, కరెంట్, రహదారులు వంటి మౌలిక వసతులు అభివృద్ధి చేసి.. పనులు ప్రారంభమయ్యేలా చేసింది చంద్రబాబు ప్రభుత్వమని టీడీపీ శ్రేణులు కౌంటరిస్తున్నాయి.