తెలంగాణలోని క్రిస్టియన్ మైనారిటీల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీఎస్‌సీఎంఎఫ్‌సీ) 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన స్వయం ఉపాధి పథకాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు మైనారిటీ మంత్రిత్వ శాఖ మహమ్మద్ అజారుద్దీన్.. ఓబీఎంఎంఎస్ పోర్టల్‌ను ప్రారంభించి.. అర్హులైన క్రిస్టియన్ మైనారిటీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ పథకం కింద కుట్టు మిషన్లు, చిన్న వ్యాపార యూనిట్లు, పెట్టీ బిజినెస్‌లు, ఈ-బైక్‌లు, ఈ-స్కూటీలు, మోటార్ బైక్‌ల కోసం ఆర్థిక సహాయం అందించనున్నారు. మహిళలు, యువత స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరిగేలా ఓబీఎంఎంఎస్ వ్యవస్థను రూపొందించినట్లు వెల్లడించారు.దరఖాస్తుల ప్రక్రియ జూలై 3వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కుట్టు మిషన్లు, చిన్న వ్యాపార యూనిట్ల కోసం దరఖాస్తు చేసే వారి వయస్సు 21 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ-బైక్, ఈ-స్కూటీ, మోటార్ బైక్ యూనిట్ల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 21 ఏళ్ల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.అర్హతల విషయానికి వస్తే.. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలలోపు.. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలలోపు ఉండాలి. వయస్సు, విద్యార్హతలు, ఇతర నిబంధనల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు అధికారిక tsobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. అలాగే పూర్తి వివరాల కోసం tscmfc.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. సాంకేతిక సమస్యలు లేదా ఇతర సందేహాల నివృత్తి కోసం 040-23391067 నంబర్‌ను సంప్రదించాలని తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పి. సబిత సూచించారు. అర్హులైన క్రిస్టియన్ మైనారిటీ అభ్యర్థులు గడువులోపు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ స్వయం ఉపాధి పథకాల ప్రయోజనాలను పొందాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.